కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB) దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB) దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. క్యాబ్.. చట్ట వ్యతిరేకం అని ఆందోళనలు చేస్తున్నారు. పౌరసత్వ బిల్లుని నిరసిస్తూ ఐపీఎస్ అబ్దుర్ రహమాన్ తన ఉద్యోగానికి రిజైన్ చేశారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి పౌరసత్వ బిల్లు విరద్ధం అంటూ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
గురువారం(డిసెంబర్ 12, 2019) పౌరసత్వ సవరణ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పిటిషన్ దాఖలు చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని..బిల్లును రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొంది. పౌరసత్వ సవరణ బిల్లుపై పిటిషన్ వేసే యోచనలో అసోం స్టూడెంట్స్ యూనియన్ ఉన్నట్లు తెలుస్తోంది.
బుధవారం(డిసెంబర్11, 2019) రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చాయి. అంతకముందు లోక్ సభలో బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, క్రిస్టియన్, పార్శీ, జైన్, బౌద్ధ, సిక్కు మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు CAB.
పౌరసత్వ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లింల హక్కులకు విఘాతం కలుగుతుందని వాపోతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ వచ్చిన భారత మూల సిద్ధాంతాలకు ఈ పౌరసత్వ సవరణ బిల్లు గొడ్డలి పెట్టుగా పరిణమిస్తుందని విపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి. విభజించి పాలించు అనే విధానానికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసినట్టుగా అనిపిస్తోందని అభిప్రాయపడ్డాయి.