పెరగనున్న పెట్రోల్,డీజిల్ ధరలు

రెండు రోజుల క్రితం సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరామ్‌ కోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారులు డ్రోన్ల దాడి చేసిన విషయం తెలిసిందే. దీని  కారణంగా ఆయిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు 13 శాతం పెరిగాయి. ఈ ప్రభావం భారత్ పైన పడే అవకాశముంది.

డ్రోన్ దాడి కారణంగా రోజువారీ ముడి చమురు ఉత్పత్తి 5.7 మిలియన్ బ్యారెల్స్ తగ్గిన విషయం తెలిసిందే. చమురు ఉత్పత్తిలో దాదాపు సగం తగ్గింది. ఈ ప్రభావం ప్రపంచంపై పడనుంది. ఈ ప్రభావం భారత్‌లో రిటైల్ ధరలపై పడుతుందని చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ధరలతో ముడివడి ఉంటాయి. కాబట్టి అంతర్జాతీయంగా ఏ పరిణామం అయినా భారత్‌లో చమురు ధరలపై ఉంటుంది. ప్రస్తుత పరిణామం భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు దారి తీస్తుందని చెబుతున్నారు.

ప్రస్తుతం భారత ఇంధన అవసరాల్లో 80% దిగుమతుల ద్వారానే తీరుతోంది. అదే సమయంలో మార్కెట్‌లో చమురు సరఫరాకు ఇబ్బందులు కలుగకుండా తమ భాగస్వామ్య దేశాలతో కలిసి పని చేస్తున్నామన్నట్లు అమెరికా ప్రకటించింది.

అయితే సోమవారం ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ.76.57, డీజిల్ ధర రూ.71.33గా ఉంది. విజయవాడలో పెట్రోల్ రూ.76.04, డీజిల్ రూ.70.48గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72.03,డీజిల్ ధర రూ.65.43గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.77.71, డీజిల్ రూ.68.62గా ఉంది. అయితే త్వరలో ధరలు పెరిగే అవకాశాలు ఉండే అవకాశముందని తెలుస్తోంది.

సౌదీ అరేబియాలోని ప్రధాన చమురు క్షేత్రాలపై దాడి..భారతదేశానికి ఆయిల్ సరఫరా అంతరాయం కలిగించదని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ అన్నారు.సెప్టెంబరు నెలలో భారతదేశపు మొత్తం ముడి చమురు సరఫరాను దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమీక్షించాము. భారతదేశానికి సరఫరా అంతరాయం ఉండదని మేము విశ్వసిస్తున్నాము. అభివృద్ధి చెందుతున్న పరిస్థితిని మేము నిశితంగా పరిశీలిస్తున్నాము అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.