Photo Shows Electric Scooter Owner Fined For Not Having Valid Pollution Certificate In Kerala
Kerala: అదేదో సినిమాలో రవితేజ ట్రాఫిక్ పోలీసు అయి కారులో ఉన్న వ్యక్తికి హెల్మెట్ లేదని ఫైన్ వసూలు చేస్తాడు. ఇంకేదో సినిమా ఎంఎస్ నారాయణ.. ‘నో పార్కింగు జోన్’లో వాహనాలు పార్క్ చేయట్లేదని, వాహనాలు పార్కింగ్ దగ్గర ‘నో పార్కింగ్’ బోర్డు పెట్టి ఫైన్లు వసూలు చేస్తూ ఉంటాడు. సినిమాల్లోనే కాదు, ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలో కూడా అనేకం జరుగుతుంటాయి. హైదరాబాద్‌లో బండి బయటికి తీయడం ఆలస్యం.. అందరి కంటే ముందు ట్రాఫిక్ పోలీసులే దర్శనం ఇస్తారు. వాళ్లు అడిగినవి ఉన్నాయ పర్లేదు, ఏ ఒక్కటి మిస్సైనా జరిమానా చెల్లించుకోవాల్సిందే. ఒక్కోసారి అన్నీ ఉన్నా విచిత్రమైన కారణాలు చెప్తూ జరిమానాలు వసూలు చేస్తున్నారని వాహనదారుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.
ఇలాంటిదే తాజాగా కేరళలో జరిగిన ఒక సంఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది. పొల్యూషన్‌కు ఏమాత్రం ప్రతికూలం కాని ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని పోలీసులు చలానా వేశారు. వీళ్లేలా పోలీసు ఉద్యోగం పొందారని విమర్శిస్తే వస్తే రావచ్చు గాక.. కానీ పెట్రోల్ బండి అయినా, ఎలక్ట్రిక్ బండి అయినా ఒకేలా వ్యవహరిస్తామని, రెండింటి మధ్య తేడాలు చూపించేంత పక్షపాతం తమకు లేదని నిరూపించడానికే పోలీసులు అనుకుని ఆ చలానా వేసి ఉండవచ్చేమో అంటూ నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు.
మలప్పురంలోని నీలంచెరిలో సెప్టెంబర్ 6న కాలుష్య రహిత ఏథర్ 450ఎక్స్ బైక్‌కు చలానా వేశారు. అది కూడా పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని. ఆకుపచ్చ లైసెన్స్ ప్లేట్ కనిపిస్తూనే ఉంది. పైగా ఆ బైక్ ఉద్గారాలను విడుదల చేయదని కూడా తెల్సు. ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా జరిమానా వడ్డించేశారు. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 213(5)(ఈ) నిబంధన ఉల్లంఘించినందుకు రూ. 250 జరిమానా విధించినట్లు చలానాలో పోటీసులు తెలిపారు. కాగా, బైక్ ఫొటో, చలానా ఫొటో నెటిజెన్లకు దొరికింది. ఇక వాళ్లు వదులుతారా?!
‘నడుచుకుంటూ వెళ్ల వారిపై కూడా చలానా వేయగలరు. ట్రాఫిక్ పోలీసులకు కనపడకుండా నడవండి’ అని ఒకరు.. ‘రూల్ అంటే రూలే.. ఏ బండి అయితే ఏంటి? నిబంధనలు పాటించాల్సిందే’ అని మరొకరు.. ‘పోలీసులా మజాకా.. వారితో పెట్టుకుంటే సైకిల్కైనా చలానా వేయగలరు’ అంటూ నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.