×
Ad

స్టాండప్ కమెడియన్, బిగ్‌బాస్ షో-17 విజేత మునావర్‌ను హత్య చేసేందుకు స్కెచ్‌.. ఇద్దరి అరెస్ట్‌.. ఎందుకు చంపాలనుకున్నారు?

హిందూ దేవతలపై ఫారూకీ వేసే జోక్స్ ఆ మతం వారి మనోభావాలను దెబ్బతీస్తున్నాయని..

Munawar Faruqui

Munawar Faruqui: స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్‌బాస్ షో సీజన్ 17 విజేత మునావర్ ఫారూకీని హత్య చేసేందుకు ఓ గ్యాంగ్ స్కెచ్‌ వేసుకుంది. ఆ గ్యాంగ్‌ ప్రయత్నాలను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. రోహిత్ గోదారా, గోల్డీ బ్రార్, విరేంద్ర చరణ్ గ్యాంగ్ నుంచి ఇద్దరిని అరెస్టు చేశారు.

పోలీసు అధికారులు దీనిపై మాట్లాడుతూ.. జైతుపూర్-కలిందీ కుంజ్ రోడ్‌లో ఆ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేశామని తెలిపారు. ఆ సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. వీరిని హరియాణా రాష్ట్రంలోని పాణిపత్, భివాని ప్రాంతాలకు చెందిన రాహుల్, సాహిల్‌గా పోలీసులు గుర్తించామన్నారు. కాల్పుల్లో రాహుల్‌కు గాయాలయ్యాయని తెలిపారు. 2024 డిసెంబర్‌లో హరియాణా యమునానగర్‌లో జరిగిన ట్రిపుల్ మర్డర్‌కి సంబంధించి వాటెండ్‌ లిస్టులో అతడు ఉన్నాడని అధికారులు తెలిపారు.

ఈ ఇద్దరు వ్యక్తులు విదేశాల్లో ఉన్న రోహిత్ గోదారా సూచనల ప్రకారం గోల్డీ బ్రార్, విరేంద్ర చరణ్‌తో కలిసి ఫారూకీని హతమార్చాలని కుట్ర పన్నారు. ఈ గ్యాంగ్ సభ్యులు ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో ఫారూకీ మూవ్‌మెంట్స్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

ఎవరు ఈ ఫారూకీ?
మునావర్ ఫారూకీ 2024లో హిందీ రియాలిటీ షో బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి 14.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఫారూకీకి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ గత ఏడాది గుర్తించింది. లారెన్స్ బిష్నోయ్ హిట్‌లిస్ట్‌లో ఫారూకీ ఉన్నాడు.

ఫారూకీ తన షోల్లో చేసే కామెంట్ల వల్ల ఎల్లప్పుడూ అతడిని వివాదాలు చుట్టుముడుతుంటాయి. నాలుగేళ్ల క్రితం ఓ కేసులో అతడు 35 రోజుల జైలులో ఉన్నాడు. గతంలో ఫారూకీ హైదరాబాద్‌లోనూ షో నిర్వహించాలని అనుకున్నాడు. అప్పట్లో ఫారూకీ ఇక్కడ షో చేస్తే ఊరుకోబోమంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

మునావర్ ఫారూకీకి రోహిత్ గోదారా, గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యులు లక్ష్యంగా చేసుకున్నారు. ఎందుకంటే హిందూ దేవతలపై ఫారూకీ వేసే జోక్స్ ఆ కమ్యూనిటీ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారని వారు చెబుతున్నారు.