మోదీ బంపర్ ఆఫర్.. ఫస్ట్ టైమ్ ప్రైవేట్ జాబ్ కొట్టిన వారికి డబ్బులు.. వన్ టైమ్ ఇన్సెంటివ్ ఎంతంటే..?

ఆగస్ట్ 1 నుంచి అమలులోకి రానున్న ఈ పథకానికి రూ.లక్ష కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ఈస్ట్ చంపారన్‌లోని మోతిహారిలో గాంధీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ రూ.7,217 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రవాణా, మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ అభివృద్ధి రంగాల్లో ఈ ప్రాజెక్టులు చేపట్టారు.

ప్రైవేట్ రంగ ఉద్యోగార్థుల కోసం పథకం
ప్రైవేట్ రంగంలో ఫస్ట్ టైమ్ ఉద్యోగం పొందిన వారికి రూ.15,000 వన్ టైమ్ ఇన్సెంటివ్ ప్రకటించారు మోదీ. ఆగస్ట్ 1 నుంచి అమలులోకి రానున్న ఈ పథకానికి రూ.లక్ష కోట్లు కేటాయిస్తునట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మోదీ నాలుగు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభించారు. తూర్పు దేశంలో రైలు కనెక్టివిటీ మెరుగుపర్చే దిశగా ఈ ప్రాజెక్టులు ఉండనున్నాయని చెప్పారు. మౌలిక వసతుల అభివృద్ధి, స్థానిక ఉద్యోగాల కల్పనపై బిహార్ ప్రభుత్వంతో కలిసి కేంద్ర సర్కారు పని చేస్తోందన్నారు.

యువతకి ఉపాధే లక్ష్యంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చామన్నారు. ముఖ్యంగా బిహార్ యువతకి ఇది ఉపాధి అవకాశాలు అందిస్తుందని వివరించారు.

గత ఆర్జేడీ–కాంగ్రెస్ పాలనపై మోదీ విమర్శలు చేశారు. పేదల కోసం వచ్చిన నిధులు మాయమయ్యాయని ఆరోపించారు. ఎన్డీఏ పాలనలో జనధన్ యోజన వంటి పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారులకు నిధులు చేరుతున్నాయని చెప్పారు.

ఒకప్పుడు సంపదను చూపించడానికే ప్రజలు భయపడేవారని, ఇప్పుడు మార్పు వచ్చిందన్నారు. “అభివృద్ధి చెందిన బిహార్” లక్ష్యంగా ప్రతి యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, వారు వలసలు వెళ్లకుండా చేస్తామని చెప్పారు.