పాకిస్థాన్ ప్రధానమంత్రికి నరేంద్ర మోదీ అభినందనలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు అభినందనలు తెలిపారు.

PM Modi Congratulates Shehbaz Sharif On 2nd Term As Pakisatn PM

PM Modi Congratulates Shehbaz Sharif: పాకిస్థాన్ ప్రధానమంత్రిగా రెండో పర్యాయం ఎన్నికైన పీఎంఎల్ ఎన్ నేత షెహబాజ్ షరీఫ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అభినందనలు తెలిపారు. పాకిస్థాన్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్ ద్వారా షెహబాజ్ షరీఫ్‌కు మోదీ అభినందనలు తెలిపారు.

కొత్త ప్రధాన మంత్రిని ఎన్నుకోవడానికి పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఆదివారం నిర్వహించిన ఓటింగ్‌లో షెహబాజ్ షరీఫ్‌ మెజారిటీ సభ్యుల మద్దతు సంపాదించారు. మొత్తం 336 ఓట్లలో ఆయనకు అనుకూలంగా 201 ఓట్లు వచ్చాయి. మేజిక్ ఫిగర్ కంటే 32 ఓట్లు ఎక్కువగా సాధించారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్ 92 ఓట్లు దక్కించుకున్నారు.

షెహబాజ్ షరీఫ్‌ రెండోసారి పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. అంతకుముందు 2022, ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు ప్రధానిగా ఉన్నారు. తాజాగా పాకిస్థాన్ 24వ ప్రధానమంత్రి అయ్యారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్ ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అలయెన్స్ ప్రభుత్వాన్ని ఆయన నడపనున్నారు.