“హింస” తర్వాత తొలిసారి మణిపూర్‌లో పర్యటించిన మోదీ.. కీలక ప్రసంగం.. శాంతి సందేశం

అభివృద్ధికి శాంతి అత్యవసరమని ప్రధాని మోదీ చెప్పారు. ఇక్కడి వారితో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. శాంతి మార్గంలో నడవాలని, పిల్లల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.

Manipur: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మణిపూర్‌లో పర్యటించారు. రూ.7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. కుకీల ఆధిపత్య ప్రాంతం చురాచాంద్‌పూర్‌లోని పీస్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడారు.

మణిపూర్‌లో 2023 మేలో ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మణిపూర్‌లో ప్రధాని మోదీ చేస్తున్న ఇదే తొలి పర్యటన ఇదే. మేతైలకు షెడ్యూల్డ్ ట్రైబ్ హోదా ఇవ్వాలని హైకోర్టు చెప్పిన తరువాత కుకీలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో 2023లో హింస చెలరేగింది. ఆ హింసలో 260 మందికి పైగా మరణించగా, సుమారు 60,000 మంది నిరాశ్రయులయ్యారు. 2025 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. తరువాత రాష్ట్రపతి పాలన విధించారు.

‘భారత మాతాకి జై’ అంటూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. మణిపూరి మహిళల కోసం వర్కింగ్ విమెన్స్ హాస్టల్ నిర్మిస్తున్నామని తెలిపారు. మణిపూర్‌లో నిరాశ్రయుల కోసం రూ.500 కోట్లు ప్రత్యేకంగా కేటాయించామని అన్నారు. గిరిజన యువత ఆశలు, కష్టాల గురించి తనకు తెలుసని చెప్పారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.

“మణిపూరి సంస్కృతి మహిళా శక్తిని ప్రోత్సహిస్తుంది. మణిపూరి మహిళల కోసం వర్కింగ్ విమెన్స్ హాస్టల్ నిర్మిస్తున్నాం. మణిపూర్‌ను శాంతి, సంపదలకు ప్రతీకగా మలచాలని కోరుకుంటున్నాం. నిరాశ్రయులకు పునరావాసం కల్పించడానికి, శాంతి కోసం భారత ప్రభుత్వం మణిపూర్ ప్రభుత్వానికి సాయం చేస్తూనే ఉంటుంది” అని అన్నారు.

Also Read: కూకట్‌పల్లి రేణు హత్య కేసు.. బిహార్‌లో దొరికిన నిందితులు.. ఆ ఒక్క క్లూతో ఎలా దొరికారంటే?

అభివృద్ధికి శాంతి అత్యవసరమని ప్రధాని మోదీ చెప్పారు. ఇక్కడి వారితో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అందరూ శాంతి మార్గంలో నడవాలని, పిల్లల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. (Manipur)

తాను, భారత ప్రభుత్వం మణిపూర్‌ ప్రజలకు సపోర్టుగా వారితోనే ఉన్నామని అన్నారు. మణిపూర్‌లో ప్రజల జీవనాన్ని తిరిగి గాడిన పెట్టడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. నిరాశ్రయులైన వారికి 7,000 ఇళ్లు నిర్మించడానికి సాయం చేస్తున్నామని చెప్పారు.

“మణిపూర్ అనే పేరులోనే ‘మణి’ ఉంది. అది రాబోయే కాలంలో మొత్తం ఈశాన్య ప్రాంతంలో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. కొద్ది సేపటి క్రితమే ఈ వేదిక నుంచి రూ.7,000 కోట్ల ప్రాజెక్టులకు పునాదిరాయి వేశాం. ఇవి ప్రజల జీవితాలను, ముఖ్యంగా కొండల్లో నివసించే గిరిజన సమాజాల జీవితాలను మెరుగుపరుస్తాయి. ఆరోగ్యం, విద్యలో కొత్త సౌకర్యాలను అందిస్తాయి” అని ప్రధాని మోదీ అన్నారు.

ఇక్కడ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. “మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం. ఇక్కడ కనెక్టివిటీ సమస్యగా ఉంది. పాడైన రహదారుల వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు నాకు తెలుసు. 2014 తరువాత మణిపూర్ కనెక్టివిటీపై పని చేశాను. మణిపూర్ రైలు, రోడ్ల బడ్జెట్ పెంచాం. రోడ్లను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాం” అని మోదీ అన్నారు.