PM Modi : అమెరికా పర్యటనకు వెళ్లిన నరేంద్ర మోదీ.. ప్రధాని హోదాలో అమెరికా ఎన్నిసార్లు వెళ్లారో తెలుసా?

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెల్లవారుజామున అమెరికా పర్యటనకు బయలుదేరారు. మూడ్రోజుల అమెరికా పర్యటనలో భాగంగా..

PM Modi

PM Modi America Tour : ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెల్లవారుజామున అమెరికా పర్యటనకు బయలుదేరారు. మూడ్రోజుల అమెరికా పర్యటనలో భాగంగా.. మోదీ క్వాడ్ సమ్మిట్ లో పాల్గొంటారు. పలు ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉంది. అమెరికా వెళ్లే ముందు ప్రధాని మాట్లాడుతూ.. ఈరోజు నేను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన స్వస్థలమైన విల్మింగ్టన్ లో నిర్వహించే క్వాడ్ సమ్మిట్ కు హాజరు కాబోతున్నానని అన్నారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ భవిష్యత్తు శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించడానికి ఎదురు చూస్తున్నానని మోదీ చెప్పారు. క్వాడ్ సమ్మిట్ లో నా సహోద్యోగులు ప్రెసిడెంట్ బిడెన్, ప్రధాన మంత్రి అల్బనీస్, పీఎం పుమియో కిషిడాను కలిసేందుకు ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు.

Also Read : Priyanka Gandhi: మల్లిఖార్జున్ ఖర్గేకు జేపీ నడ్డా లేఖ.. ప్రియాంక గాంధీ ఫైర్

న్యూయార్క్ లోని యూఏ జనరల్ అసెంబ్లీలో ప్యూచర్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. అమెరికా పర్యటనలో పలువురు వ్యాపార వేత్తలతో మోదీ సమావేశం కానున్నారు. ఇండో – పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా క్వాడ్ సమ్మిట్ జరగనుంది. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడితో జరిగే చర్చల్లో భారత ప్రజల ప్రయోజనాలు, ప్రపంచ ప్రయోజనాలపై, భారతదేశం – యుఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం పై చర్చలు జరగనున్నాయి.

 

ప్రధానమంత్రిగా మోదీ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు అమెరికా పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం తొమ్మిదో సారి మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. మొత్తం తొమ్మిది మంది భారత ప్రధానులు ఇప్పటి వరకు అమెరికా పర్యటనకు అధికారికంగా వెళ్లారు. వీరిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎనిమిది సార్లు అమెరికాను సందర్శించగా, దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నాలుగు సార్లు అమెరికా పర్యటనకు వెళ్లారు. అటల్ బిహారీ వాజ్ పేయి కూడా నాలుగు సార్లు అమెరికా పర్యటనకు వెళ్లగా.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి హోదాలో మూడు సార్లు, పీవీ నర్సింహారావు రెండు సార్లు, మొరార్జీ దేశాయ్, ఐకే గుజ్రాల్ ఒకసారి ప్రధాని హోదాలో అమెరికా పర్యటనకు వెళ్లారు.