PM Kisan: పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. రైతుల అకౌంట్లలో డబ్బులు జమయ్యాయి. తమిళనాడులోని కోయంబత్తూరులో బటన్ నొక్కి పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ రిలీజ్ చేశారు. దీంతో దేశంలో అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమయ్యాయి.
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే పీఎం కిసాన్. ఈ పథకం కింద 21వ విడత నిధులను కోయంబత్తూరులో విడుదల చేశారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా 9కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లకు పైగా నిధులు జమయ్యాయి.
సేద్యంలో రసాయన ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగంతో నేల సారం దెబ్బతింటోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సేంద్రీయ సాగుతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంలోనూ ఈ తరహా వ్యవసాయ విధానాలు సాయపడతాయన్నారు. సేంద్రియ సాగులో ప్రపంచానికి కేంద్రంగా నిలిచే దిశగా భారత్ పయనిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. తృణ ధాన్యాలను సూపర్
ఫుడ్ గా అభివర్ణించిన ప్రధాని మోదీ.. ఈ పంటలను సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్). 2019 ఫిబ్రవరి 24న ఈ పథకం ప్రారంభించింది. సాగు భూమి ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా రూ. 6 వేల చొప్పున అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా 2వేల చొప్పున మూడు విడతల్లో చెల్లిస్తారు. ఇప్పటివరకు 20 విడతల్లో డబ్బులు పడ్డాయి. ఇవాళ (నవంబర్ 19) 21వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ అవుతాయి.
Also Read: ఏపీ రైతులకు బిగ్ అలర్ట్.. ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు పడకపోతే ఏం చేయాలి? ఫుల్ డిటెయిల్స్..!