యుక్రెయిన్‌లో యుద్ధం, భారత్‌పై ట్రంప్‌ టారిఫ్‌ల వేళ.. యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోనులో మాట్లాడిన మోదీ.. ఏం జరుగుతోంది?

జపోరిజ్జియా బస్ స్టేషన్‌పై జరిగిన రష్యా బాంబు దాడి సహా తాజా దాడులపై మోదీకి జెలెన్‌స్కీ వివరాలు తెలిపారు. ఆ దాడిలో పదుల సంఖ్యలో జవాన్లు గాయపడ్డారని తెలిపారు.

యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక సహకారం, యుక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం వంటి ప్రధాన అంశాలపై చర్చించారు.

జపోరిజ్జియా బస్ స్టేషన్‌పై జరిగిన రష్యా బాంబు దాడి సహా తాజా దాడులపై మోదీకి జెలెన్‌స్కీ వివరాలు తెలిపారు. ఆ దాడిలో పదుల సంఖ్యలో జవాన్లు గాయపడ్డారని తెలిపారు.

మోదీ ‘ఎక్స్‌’లో పలు వివరాలు తెలిపారు. “జెలెన్‌స్కీతో మాట్లాడటం ఆనందంగా ఉంది. ఘర్షణకు త్వరగా, శాంతియుత పరిష్కారం అవసరమని భారత స్థిర వైఖరిని తెలియజేశాను. ఈ దిశగా భారత్‌ సాధ్యమైనంత సహకారం అందించేందుకు కట్టుబడి ఉంది. యుక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుచుకోవాలనుకుంటున్నాం” అని పేర్కొన్నారు.

జెలెన్‌స్కీ స్పందన
జెలెన్‌స్కీ కూడా ఎక్స్‌లో స్పందిస్తూ.. “భారత ప్రధాని మోదీతో సుదీర్ఘ సంభాషణ జరిపాం. ద్వైపాక్షిక సహకారం, అంతర్జాతీయ పరిస్థితులపై విపులంగా చర్చించాం. మా ప్రజలకు మద్దతు తెలుపుతూ మోదీ మాట్లాడినందుకు ధన్యవాదాలు. రష్యా దాడుల వివరాలు, జపోరిజ్జియా బస్ స్టేషన్‌పై నిన్న జరిగిన దాడి గురించి వివరించాను. యుద్ధం ముగించే అవకాశాలు ఉన్న వేళ, రష్యా తాత్కాలిక విరమణకు సిద్ధం కాకుండా ఆక్రమణ, హత్యలను కొనసాగిస్తోంది” అని తెలిపారు.

రష్యా చమురు సహా శక్తి ఎగుమతులను పరిమితం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రష్యా సామర్థ్యాన్ని తగ్గించేందుకు ఎనర్జీ ఎగుమతులు, ముఖ్యంగా చమురు ఎగుమతులను నియంత్రించాలి అన్నారు.

ఆగస్టు 15న అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం కానున్నారు. యుక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు దిశగా చర్చలు జరగనున్నాయి. భారత విదేశాంగ శాఖ ఈ చర్చలను స్వాగతిస్తూ, శాంతి పునరుద్ధరణకు దౌత్య ప్రయత్నాల ప్రాముఖ్యతను ప్రస్తావించింది.