PM Modi
PM Modi: ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి త్వరలోనే అమల్లోకి రానున్నాయి. ఇది కచ్చితంగా జరుగుతుంది. ఎవరూ దీన్ని అడ్డుకోలేరని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ లోని కేవడియాలో ప్రధాని మోదీ నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో మోదీ పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకోసం కొన్ని శక్తులు జాతీయ ఐక్యతను లోపల, బయట నుంచి బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, వారి కుట్రలు సాగనివ్వం అని అన్నారు. దేశ ప్రగతికి అడ్డుగోడలా ఉందనే ఆర్టికల్ 370ని తొలగించామని చెప్పారు.
Also Read: Wayanad: వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీతో పోటీ పడుతున్న 15 మంది అభ్యర్థులు
జమ్మూకశ్మీర్ లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల తరువాత ఒమర్ అబ్దుల్లా సీఎం అయ్యారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ.. మొట్టమొదటి సారిగా జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి భారత రాజ్యాంగంపై ప్రమాణ చేశారని.. ఇది భారతదేశ రాజ్యాంగ నిర్మాతలకు మా వినయపూర్వకమైన నివాళి అని ప్రధాని మోదీ అన్నారు. ఇదిలాఉంటే.. కొన్ని శక్తులు ప్రపంచ వ్యాప్తంగా భారత్ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. సాయుధ దళాల్లో వేర్పాటువాదాన్ని ప్రేరేపించడమే వారి ప్రధాన లక్ష్యం. దేశ అభివృద్ధి వారి లక్ష్యం కాదంటూ.. ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశానికి హాని కలిగించేందుకు ప్రయత్నిస్తున్న అర్బన్ నక్సల్స్ కూటమిని గుర్తించాలని, వారిపై మనమంతా ఐక్యంగా పోరాటం చేయాలని ప్రధాని పిలుపు నిచ్చారు.
గత ప్రభుత్వాల వివక్షాపూరిత విధానాలు జాతీయ ఐక్యతను బలహీనపర్చాయి. గత పది సంవత్సరాలలో కొత్త పాలన నమూనా వివక్షను తొలగించిందని మోదీ అన్నారు. మేము సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ విధానం అభివృద్ధి పథకాల్లో ప్రజల్లో అసంతృప్తిని పోగొట్టింది.. వారిలో విశ్వాసాన్ని పెంచిందని అన్నారు. ఎన్డీయే హయాంలో జీఎస్టీ ద్వారా ఒక దేశం, ఒకే పన్ను విధానాన్ని తీసుకొచ్చాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఒక దేశం ఒక ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకొచ్చాం. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి.. వనరులను ఆప్టిమైజ్ చేసే ‘ఒక దేశం ఒకే ఎన్నికలు’ దిశగా పనిచేస్తున్నామని మోదీ తెలిపారు.