భారత ప్రజలు విదేశీ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలని, మనదేశ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధాని మోదీ అన్నారు. మన దేశ మార్కెట్లోకి చైనా ఉత్పత్తులు పెద్ద ఎత్తున వస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు, ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణలో పాక్‌కు టర్కీ, అజర్‌బైజాన్ మద్దతు తెలిపాయి. దీంతో బాయ్‌కాట్ టర్కీ, అజర్‌బైజాన్ అంటూ భారతీయులు పిలుపునిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మోదీ తాజాగా గుజరాత్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… హోలీ, వినాయక చవితి, దీపావళి వంటి పండుగల వేళ దిగుమతి చేసుకునే వస్తువులపై ఆధారపడవద్దని చెప్పారు. గణేశుడి విగ్రహాలను కూడా విదేశాల నుంచే తెచ్చుకుంటున్నామని ఆయన అన్నారు.
Also Read: ఆపరేషన్ సిందూర్ లోగో డిజైన్ చేసింది వీళ్లే..
విదేశీ వస్తువుల్ని అమ్మబోమని గ్రామస్థాయి నుంచి వ్యాపారులు ప్రతిజ్ఞ చేసేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు. దురదృష్టవశాత్తు గణేశుడి విగ్రహాలను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. హోలీ కలర్లు కూడా విదేశాల్లో తయారీ చేసినవి వాడుతున్నామని చెప్పారు.
బాణసంచా, బొమ్మలతో పాటు మతపరమైన విగ్రహాలు మనం చైనా నుంచి తక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. మనదేశంలో పండుగల సమయంలో జరుగుతున్న అమ్మకాల్లో విదేశీ వస్తువులదే పై చేయి ఉంటోందని తెలిపారు. దీంతో స్థానిక కళాకారులతో పాటు తయారీదారులపై ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తోందని చెప్పారు. నిత్య జీవితంలో మనం వాడతున్న దిగుమతి వస్తువుల వాడకంపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.