3వేల మంది రాయల్ ఎన్‌ఫీల్డ్ ఓనర్లకు ఫైన్.. 30 లక్షలు వసూలు చేసిన పోలీసులు

Police fine 3,000 Royal Enfield owners : దేశవ్యాప్తంగా బైకులు, కార్లను మోడిఫై చేసేస్తున్నారు. రోడ్లపై రయ్ మంటూ దూసుకెళ్తున్నారు. ఇలాంటి మోడిఫైడ్ వాహనాలపై కన్నేసిన పోలీసులు కనిపిస్తే చలాన్లు రాసేస్తున్నారు. భారీ జరిమానాలు విధిస్తున్నారు. మోడిఫైడ్ వాహనాల్లో ఎక్కువగా రాయల్ ఎన్ ఫీల్డ్ రైడర్లే ఎక్కువ మంది ఉన్నారు. మార్కెట్లోకి వచ్చిన ఎన్ ఫీల్డ్ సైలెన్సర్ (స్టాక్ ఎగ్జాస్ట్) మార్చేసి నడుపుతున్నారు. పింప్రి చించ్వాడ్ కమిషనర్ ఆదేశాల మేరకు రాయల్ ఎన్ ఫీల్డ్ మోడిఫైడ్ ఎగ్జాస్ట్ చేసిన బైకులు నడిపే వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు పోలీసులు.

పోలీసులంతా బృందాలుగా ఏర్పడి ఎక్కడా మోడిఫైడ్ వాహనం కనిపించినా వెంటనే ఆపి ఫైన్ వేసేస్తున్నారు. ఇప్పటివరకూ మోడిఫైడ్ చేసిన 3వేల వరకు రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ల వాహనాదారులపై జరిమానా విధించారు. దాదాపు అందరి నుంచి మొత్తంగా 30 లక్షల వరకు వసూలు చేశారు. సైలెన్సర్ స్టాక్ ఎగ్జాస్ట్ మార్చేసిన 2,970 రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ రైడర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. నాలుగు నెలల నుంచి పోలీసులు మోడిఫైడ్ వాహనాలపై డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

ఇప్పటివరకూ మొత్తంగా రూ.29.7 లక్షల వరకు జరిమానాల రూపంలో సేకరించారు. ఎవరైనా వాహనంలో అదనంగా ఏదైనా మోడిఫికేషన్ చేసినట్టు గుర్తిస్తే.. ఒక్కో మోటార్ సైకిల్ యజమానికి రూ.1000 చొప్పున ఫైన్ విధిస్తున్నారు. ఇప్పటివరకూ ఏదైనా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారో లేదో క్లారిటీ లేదు. డ్రైవ్ ప్రారంభమైన మొదటి 25 రోజుల్లో 908 మంది రాయల్ ఎన్ ఫీల్డ్ రైడర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీసులు నివేదికలో వెల్లడించారు.