నల్లధనంతోనే రాజకీయాలు నడుస్తున్నాయ్…రాజస్థాన్ సీఎం

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు నల్లధనంతో నడుస్తున్నాయని ఆయన అన్నారు. శనివారం(డిసెంబర్-7,2019)రాజస్థాన్ హైకోర్టు నూతన భవనం ప్రారంభోత్సవం సమయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే సమక్షంలోనే గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
 
న్యాయ వ్యవస్థ అంటే సత్యాన్ని బలపరిచేదని గెహ్లాట్ అన్నారు. యావత్తు దేశం ప్రస్తుతం ఆందోళన చెందుతోందన్నారు. సత్యమే దైవం, దైవమే సత్యం అని మహాత్మా గాంధీ చెప్పారన్నారు. అవినీతి గురించి మాట్లాడుకుంటే, సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేస్తుండటం, సుమోటో అపీళ్ళు విచారణ జరగడం తాను చాలా సందర్భాల్లో చూస్తున్నానని చెప్పారు. అవినీతి ఆరోపణలు వచ్చినపుడు ఆదాయపు పన్ను శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను పంపించడం చూస్తున్నానన్నారు. చట్ట వ్యతిరేక వనరుల నుంచి రాజకీయ పార్టీలకు నిధులు అందడం ఆగే వరకు అవినీతికి కళ్ళెం వేయడం గురించి మాట్లాడటంలో అర్థం లేదన్నారు.

కొత్తగా వచ్చిన నాయకులు తమ తొలి ఎన్నికల్లో పోటీ చేయాలన్నా, చట్ట వ్యతిరేక వనరుల నుంచి వచ్చిన సొమ్ముతోనే మొదలుపెడుతున్నారన్నారు. రాజకీయ క్రీడ మొత్తం రక్తపు సొమ్ముపైనే ఆధారపడిందన్నారు. దీనిని తగ్గించాలన్నారు. నల్లధనం…నగదు, చెక్కులు, బాండ్లు వంటి ఏ రూపంలో ఉన్నా,రాజకీయాలు నల్లధనంపై నడుస్తున్నాయని గెహ్లాట్ అన్నారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ ఎస్ ఏ బోబ్డే హైదరాబాద్ లో దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ….ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయం చేయడం కాదన్నారు. పగ తీర్చుకోవడం వల్ల న్యాయానికి ఉన్న గుణం పోతుందని చెప్పారు. న్యాయ విచారణ జరిగాకే శిక్షలు విధించాలన్నారు. తక్షణ న్యాయం అడగడం సరికాదన్నారు.