భారత్‌కు రానున్న ప్రజ్వల్ రేవణ్ణ.. ఏ తప్పూ చేయలేదని ప్రకటన

సిట్ విచారణకు సహకరిస్తానని ప్రజ్వల్ రేవణ్ణ స్పష్టం చేశారు.

Prajwal Revanna : మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ ఈ నెల 31న భారత్ కు రాబోతున్నారు. అదే రోజు సిట్ ముందు విచారణకు హాజరుకాబోతున్నారు. తాను ఏ తప్పూ చేయలేదని ప్రజ్వల్ అంటున్నారు. తనపై రాజకీయ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఆధారాలు లేని అభియోగాలు మోపారని చెప్పారు. సిట్ విచారణకు సహకరిస్తానని ప్రజ్వల్ రేవణ్ణ స్పష్టం చేశారు.

మహిళలపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపనలు ఎదుర్కొంటున్న రేవణ్ణ ఏప్రిల్ 27న జర్మనీ పారిపోయారు. వందల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనేక మంది మహిళలను లైంగికంగా వేధించిన రేవణ్ణ ఎట్టకేలకు భారత్ తిరిగి వస్తున్నారు. విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ రేవణ్ణ పాస్ పోర్టును బ్లాక్ చేసే అంశంపై దృష్టి పెట్టింది. అతడిని వెనక్కి తీసుకొచ్చి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్న తరుణంలో.. తాను భారత్ కు తిరిగి వస్తున్నట్లు రేవణ్ణ ప్రకటించారు. అలాగే కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు సహకరిస్తానని కూడా చెబుతూ వీడియోని రిలీజ్ చేశారు రేవణ్ణ.

రాజకీయంగా తనపై కుట్ర పన్నారు, ముఖ్యంగా రాహుల్ గాంధీ సహా అనేకమంది కాంగ్రెస్ నేతలు వీడియోలను వైరల్ చేశారని ఆరోపించారు. దాంతో తాను డిప్రెషన్ లోకి వెళ్లానని, అందుకే దేశం విడిచి వెళ్లిపోయానని వీడియోలో వెల్లడించారు. న్యాయపరంగా పోరాటం చేస్తానని, కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాఫ్తు సంస్థ విచారణకు కూడా సహకరిస్తానని ప్రజ్వల్ రేవణ్ణ తెలిపారు. మే 31న మధ్యాహ్నం 2గంటలకు సిట్ విచారణకు హాజరవుతానని వీడియోలో పేర్కొన్నారు రేవణ్ణ.

జేడీఎస్-బీజేపీ కలిసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఎన్నికల తర్వాత ఏప్రిల్ 27న జర్మనీకి పారిపోయారు ప్రజ్వల్ రేవణ్ణ. ప్రజ్వల్ హసన్ ఎంపీగా ఉన్నారు. మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ మనవడు. భారత అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అటువంటి వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసు నమోదవడంపై బీజేపీ సైతం చాలా తీవ్రంగా స్పందించింది. మహిళలను అగౌరవపరిచే వారిని, కించపరిచే వారిని ఎవరినీ బీజేపీ ఉపేక్షించబోదని, ఈ విషయంలో మా స్టాండ్ స్పష్టంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. జేడీఎస్ భాగస్వామి పక్షమైనా సరే అటువంటి వారిని ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలకు మద్దతిస్తామని చెప్పడం జరిగింది.

జేడీఎస్ సైతం.. ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సిట్ విచారణ పూర్తైన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయి నిర్ణయం జేడీఎస్ కూడా తీసుకోబోతోంది. రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం కర్నాటక రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం సంచలనంగా మారింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా అనేకమంది కాంగ్రెస్ పార్టీ నేతలు.. రేవణ్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవణ్ణ లాంటి వారిని వదిలేశారు, తన లాంటివారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read : బాబోయ్ జాగ్రత్త..! నాలుగు నెలల్లో దేశంలో ఎన్ని సైబర్ మోసాలు జరిగాయో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు