పంజాబ్ సీఎంతో భేటీకి రాష్ట్రపతి తిరస్కరణ…ధర్నాకు సిద్దమైన అమరీందర్

President declines time to Punjab CM నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ బుధవారం ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద నిరసనకు ఫ్లాన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిర్వహించే ఈ ధర్నాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొంటారు.



రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో కెప్టెన్ సింగ్ ఈ నిర్ణయం తీసున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, పంజాబ్ శాసన సభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపాలని కోరేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవాలని కెప్టెన్ సింగ్ ప్రయత్నించారు. రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. అయితే కెప్టెన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రతినిథి బృందానికి అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్ నిరాకరించింది.



https://10tv.in/i-am-not-afraid-of-resigning-punjab-cm-amarinder-slams-cenntre-moves-resolution-against-farm-laws/
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ చట్టాలపై నిరసన తెలియజేసేందుకు ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ధర్నాలో ఆయనతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కూడా ఆయన ఈ ధర్నాకు ఆహ్వానించారు.



కాగా- రైతు చట్టాలను నిరసిస్తూ పంజాబ్ లో ఆందోళనకారులు రైల్ రోకో ఆందోళన చేపట్టడంతో కేంద్రం ఆ రాష్ట్రానికి రైలు సర్వీసులను నిలిపివేసింది. దీంతో నిత్యావసర సరకుల రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు తమ నిరసన కార్యక్రమాల్లో భాగంగా రైల్వే ట్రాక్‌లపై అడ్డంకులు పెడుతున్నారని, అందుకే పంజాబ్‌లో గూడ్స్ రైళ్ళను నిలిపేశామని రైల్వే శాఖ తెలిపింది రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఇటీవల పంజాబ్ అసెంబ్లీ మూడు బిల్లులను ఆమోదించిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు