మోడీ తల్లిని కలిసిన రాష్ట్రపతి

  • Publish Date - October 13, 2019 / 10:45 AM IST

శనివారం రెండురోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ(అక్టోబర్-13,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లిని కలిశారు. చిన్న కొడుకు పంకజ్ మోడీతో కలిసి గాంధీనగర్ కి దగ్గర్లోని రైసన్ గ్రామంలో ఉంటున్న మోడీ తల్లి హీరా బెన్ ని కోవింద్ కలిశారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దాదాపు అరగంటపాటు కోవింద్ పంకజ్ మోడీ నివాసంలో ఉన్నారు.

అనంతరం  కోవింద్ తన భార్యతో కలిసి కోబా గ్రామానికి దగ్గర్లోని మహవీర్ జైన్ ఆరాధన సెంటర్ కి వెళ్లారు. అక్కడ ఆచార్యశ్రీ పద్మసాగర్ సుర్జీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇవాళ మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా కోవింద్,మోడీ ఉదయం ఆయనను స్మరించుకుంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దేశ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ కోవింద్ ట్వీట్ చేశారు. సామాజిక న్యాయం గురించి మహర్షి వాల్మీకి ఇచ్చిన సందేశం మనందరికీ స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోడీ అన్నారు.