Bharat: ఇండియా పేరు భారత్ గా మార్పు.. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో తీర్మానం!?

ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు సన్నాహాలు చేస్తున్నట్టుగా కనబడుతోంది.

President of Bharat on G20 dinner invite reignites row Congress hits out

Bharat- India: ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు (Modi Govt) సన్నాహాలు చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఈ మేరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లోనే ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు జీ20 సదస్సు (G20 Summit) నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ పంపిన డిన్నర్ ఇన్విటేషన్ లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (President of Bharat) గా పేర్కొనడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) ట్విటర్ వేదికగా బట్టబయలు చేశారు. భారత్ అనే పదాన్ని అందరికీ అలవాటు చేయాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

“ఇండియా” పార్టీల లక్ష్యం ఏమిటి?
జీ20 సదస్సు సందర్భంగా సెస్టెంబర్ 9న జరగనున్న డిన్నర్ భేటీకి రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా పేర్కొన్నారని జైరాం రమేశ్ వెల్లడించారు. ఇక నుంచి రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం మన దేశం పేరును భారత్ గా పిలవాల్సి ఉంటుందన్నారు. పేరు మార్చినప్పటికీ సమాఖ్య వ్యవస్థపై దాడి కొనసాగుతూనే ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించడం, భారతదేశాన్ని విభజించడాన్ని మోదీ కొనసాగిస్తున్నారని.. ఇప్పుడు I.N.D.I.A కూటమిలోని పార్టీల లక్ష్యం ఏమిటని ప్రశ్నించారు. భారత్ లో స్నేహం, సయోధ్య, నమ్మకాన్ని తీసుకురావడం ముఖ్యమని పేర్కొన్నారు.

ఎందుకు ద్వేషిస్తున్నారు?: నడ్డా
జైరాం రమేశ్ ట్వీట్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. భారత్ పేరును కాంగ్రెస్ అనవసరంగా వివాదాస్పదం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ గౌరవం, ప్రతిష్టకు సంబంధించిన ప్రతి విషయంలోనూ కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ప్రశ్నించారు. భారత్ జోడో పేరుతో రాజకీయ యాత్రలు చేస్తున్న వారు “భారత్ మాతా కీ జై” నినాదాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారని రాహుల్ గాంధీని నిలదీశారు. కాంగ్రెస్‌కు దేశంపైనా, దేశ రాజ్యాంగంపైనా, రాజ్యాంగ సంస్థలపైనా గౌరవం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న దేశ, రాజ్యాంగ వ్యతిరేక విధానాల గురించి యావత్ దేశానికి తెలుసని పేర్కొన్నారు.

Also Read: ఇండియా పేరును భారత్‌గా మార్చండి.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

సంతోషంగా ఉంది : అసోం సీఎం
మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న ప్రతిపాదనను అసోం సీఎం హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) స్వాగతించారు. రిపబ్లిక్ ఆఫ్ భారత్- మన నాగరికత అమృత్ కాల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.

Also Read: మన దేశం పేరు ఇడియా కాదు, భారత్.. అలాగే పిలవాలంటున్న ఆర్ఎస్ఎస్ చీఫ్

విపక్షాలకు చెక్ పెట్టేందుకేనా?
26 పార్టీలతో కూడిన విపక్ష కూటమి ఇటీవల I.N.D.I.Aగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, ఆప్, ఆర్జేడీ, శివసేన, డీఎంకే, పీడీపీ, ఎన్సీపీ, జేడీ(యూ), జేఎంఎం పార్టీలతో కూడిన కూటమి వచ్చే ఎన్నికల్లో మోదీ సర్కారును గద్దెదించే లక్ష్యంతో గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో I.N.D.I.A పేరును ముందుకు తెచ్చింది. విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు దేశం పేరును భారత్ గా మార్చాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జీ20 సదస్సు ఇన్విటేషన్ లో భారత్ పేరును చేర్చినట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు