President Ram Nath Kovind, Wife Board Special Train
President Kovind : భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితాదేవితో కలిసి యూపీ కాన్పూర్‌లోని సొంతూరికి ప్రత్యేక రైలులో బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ సప్ధర్‌జంగ్ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక రైలు ఎక్కారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి దంపతులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వేబోర్డు చైర్మన్, సీఈఓ సునీశ్ శర్మ ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయనకు జ్ఞాపికను కూడా అందజేశారు.
కోవింద్ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారి తన సొంతూరికి రైలులో వెళ్తున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి రాష్ట్రపతి దంపతులు రైలులో బయలుదేరారు. ఈ సాయంత్రానికి కాన్పూర్ చేరుకునే అవకాశం ఉంది.
కాన్పూర్ దేహాట్ మార్గంలో ఈ ప్రత్యేక రైలు కాసేపు ఆగనుంది. పర్యటనలో రాష్ట్రపతి పాత పరిచయస్తులను, పాఠశాల స్నేహితులను కలుసుకోనున్నారు. సొంతూరికి వెళ్లిన తర్వాత ఆయన తిరిగి ఈ నెల 28న కాన్పూర్ సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో లక్నోకు వెళ్లనున్నారు.
పర్యటన అనంతరం 29న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి రానున్నారు. 15ఏళ్ల తర్వాత రాష్ట్రపతి రైల్లో ప్రయాణించడం తొలిసారి. 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా రాజధాని ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు రైలులో ప్రయాణించారు.