పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది.

  • Publish Date - December 13, 2019 / 03:20 AM IST

పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది.

పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. సోమవారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభకు పంపగా బుధవారం అక్కడ కూడా ఆమోదం లభించింది. పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లుకు ఆమోదం లభించడంతో రాష్ట్రపతి సంతకం కోసం ఈ బిల్లును కేంద్రం పంపించింది. దీంతో బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ కూడా ఆమోదం తెలిపారు.

బుధవారం(డిసెంబర్11, 2019) రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చాయి. అంతకముందు లోక్ సభలో బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, క్రిస్టియన్, పార్శీ, జైన్, బౌద్ధ, సిక్కు మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు CAB. 

పౌరసత్వ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లింల హక్కులకు విఘాతం కలుగుతుందని వాపోతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ వచ్చిన భారత మూల సిద్ధాంతాలకు ఈ పౌరసత్వ సవరణ బిల్లు గొడ్డలి పెట్టుగా పరిణమిస్తుందని విపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి. విభజించి పాలించు అనే విధానానికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసినట్టుగా అనిపిస్తోందని అభిప్రాయపడ్డాయి.

పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్‌ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. ఈ బిల్లును సుప్రీం కోర్టులో సవాల్‌ చేయాలని భావిస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకంతో చట్టరూపం దాల్చిన ఈ బిల్లుపై తాము సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లు న్యాయ సమీక్ష ముందు నిలవదని ఇది వరకే ఆ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఇదే బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ బిల్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని ఐయూఎంఎల్‌ తన పిటిషన్‌లో తెలిపింది.

మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. అసోం, త్రిపుర, మేఘాలయా రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గువాహటిలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గురువారం సాయంత్రం రోడ్లపైకి చేరుకున్న నిరసనకారులపై భద్రత బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పులో గాయపడ్డ ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఘర్షణల్లో గాయపడ్డ మరికొందరికి గువాహటి మెడికల్‌ కాలేజ్‌లో చికిత్స అందిస్తున్నారు.