యాక్షన్ సీన్ కిరాక్ : ఉల్లిపాయలు దోపిడీ చేసిన దొంగలు

  • Published By: veegamteam ,Published On : September 24, 2019 / 07:10 AM IST
యాక్షన్ సీన్ కిరాక్ : ఉల్లిపాయలు దోపిడీ చేసిన దొంగలు

Updated On : September 24, 2019 / 7:10 AM IST

ఉల్లి. ఇప్పుడు ఘాటుగా ఉంది. ధరలోనూ అదే స్థాయిలో దూసుకెళ్తోంది. కిలో 80 రూపాయలు పలుకుతుంది ఢిల్లీలో. ఉల్లి లేని కూరను ఊహించుకోవటం కష్టం. ఈ క్రమంలోనే సామాన్యులు కొనుగోలు చేయటానికి ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ లో ఉల్లికి ఉన్న డిమాండ్ తో.. ఏకంగా ఉల్లిపాయల గోడౌన్ ను దోచేశారు దొంగలు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..

బీహార్ రాజధాని పాట్నా. సిటీ శివార్లలో ఫతుహా అనే ఏరియా ఉంది. అక్కడ గోడౌన్లు చాలా ఉన్నాయి. ఓ గోడౌన్ లో ఉల్లిపాయలు నిల్వ చేశారు. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం కొందరు దొంగలు గోడౌన్ లోని ఉల్లిపాయలను ఎత్తుకెళ్లారు. వీటి విలువ 8 లక్షల రూపాయలు ఉంటాయని చెబుతున్నారు వ్యాపారులు. అడ్డుకున్న వారిపై దాడి చేశారు. 328 గోనె సంచులను మినీ ట్రక్కుల్లో తరలించారు. గోడౌన్ మొత్తాన్ని లూటీ చేసి.. మార్కెట్ లో అమ్మేశారనే టాక్ నడుస్తోంది. 

ఉల్లిపాయలు కొనుగోలు చేస్తాం అంటూ కొందరు వ్యక్తులు గోడౌన్ లోకి వచ్చారు. వ్యాపారితో మాటలు కలిపారు. రేటు మాట్లాడారు. అప్పటికే గోడౌన్ మొత్తం పరిశీలించిన దొంగలు యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. వ్యాపారితోపాటు అక్కడ ఉన్న నలుగురు కూలీలను కూడా తాళ్లతో కట్టేశారు. వెంటనే.. ఉల్లి బస్తాలను మినీ ట్రక్కుల్లోకి ఎక్కించారు. పారిపోయారు.

పాపం..సరుకు పోయి…దెబ్బలు తిన్న వ్యాపారి పోలీసుల‌కు కంప్లయింట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోడౌన్ కు వచ్చి పరిశీలించారు. దొంగతనం జరిగిందని నిర్థారించుకుని దర్యాప్తు చేపట్టారు. ఉల్లి దొంగల కోసం గాలిస్తున్నారు. దొంగలు చోరి కోసం మూడు మినీ ట్రక్కులు ఉపయోగించినట్లు చెబుతున్నారు. దొంగలెవరో తెలియాల్సి ఉందని తెలిపారు.