నా తదుపరి మిషన్ ‘వెడ్ ఇన్ ఇండియా’: ప్రధాని మోదీ ప్రకటన

విహార యాత్రలకు జమ్మూకశ్మీర్‌కు వెళ్లాలంటే ఒకప్పుడు భయపడేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Narendra Modi Next Mission: తన తదుపరి మిషన్ ‘వెడ్ ఇన్ ఇండియా’ అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఇండియాను వేదికగా చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారాయన. జమ్మూకశ్మీర్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని హామీయిచ్చారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తొలిసారిగా గురువారం జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. శ్రీనగర్‌లో రూ.6400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యాక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బక్షీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు.

“ఇప్పుడు నా తదుపరి మిషన్ ‘వెడ్ ఇన్ ఇండియా’. డెస్టినేషన్ పెళ్లిళ్లు చేసుకునేవారంతా జమ్మూకశ్మీర్‌కు వచ్చేలా చేస్తాం. G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సును ఎలా నిర్వహించామో ప్రపంచమంతా చూసింది. విహార యాత్రలకు జమ్మూకశ్మీర్‌కు వెళ్లాలంటే ఒకప్పుడు భయపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. జమ్మూకశ్మీర్‌లో టూరిజం అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. 2023లో, 2 కోట్ల మందికి పైగా పర్యాటకులు ఇక్కడికి వచ్చారు. ఇపుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సెలబ్రిటీలు కూడా కశ్మీర్‌ వస్తున్నార”ని ప్రధాని మోదీ అన్నారు.

ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్ స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటోందని, డెవ‌ల‌ప్‌మెంట్‌లో సరికొత్త శిఖరాలను చేరుకుంటోందని తెలిపారు. ఆర్టికల్ 370తో రాజకీయ కుటుంబాలే లాభపడ్డాయని, సామాన్యులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్, దాని భాగస్వామ్య పార్టీలు అనవసర రాద్ధాంతం చేశాయని విమర్శించారు.

Also Read: ప్రధాని నరేంద్ర మోదీకి అందుకే రేవంత్ రెడ్డి దగ్గరవుతున్నారు: నిరంజన్ రెడ్డి