Punjab Government school
Punjab Government schools: పంజాబ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బోధన చేపట్టనుంది. ఈ నెల 26వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు అక్కడి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి శిభిరాలను నిర్వహించనుంది. విద్యార్థులకు కొత్త భారతీయ భాషలో ప్రాథమిక సంభాషణా నైపుణ్యాలను పొందడంలో సహాయపడటానికి ఈ క్లాసులను నిర్వహించనుంది. ఇందులో తెలుగు భాషపై వేసవి శిబిరాల్లో విద్యార్థులకు బోధించనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే వేసవి శిబిరాల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొంటారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ శిబిరాలు కొనసాగుతాయి. 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులను మూడు గ్రూపులుగా విభజించి మూడు గంటల పాటు తెలుగు బోధించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
పంజాబ్ ప్రభుత్వం నిర్ణయాన్ని కొందరు అభినందిస్తుండగా.. కొందరు వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్ లోని డెమోక్రటిక్ టీచర్స్ ఫ్రంట్ (DTF) ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు పంజాబీని మాతృభాషగా కలిగి ఉన్నప్పటికీ.. 12వ తరగతిలో 3,800 మందికిపైగా విద్యార్థులు, 10వ తరగతిలో 1571 మంది విద్యార్థులు జనరల్ పంజాబీలో మొదటి భాషగా ఉత్తీర్ణులు కాలేదని పేర్కొంది. ఈ క్రమంలో మూడు భాషల విధానాన్ని విచ్ఛిన్నం చేస్తూ తెలుగును నాల్గో భాషగా ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనను డీటీఎఫ్ తప్పుబడుతుంది.