15 గ్రామాలకు తాళం : 100మందిని కలిసిన కరోనా మృతుడు…23మందికి పాజిటివ్

కరోనా వైరస్(COVID-19)సోకి మార్చి-18,2020న పంజాబ్ లో 70ఏళ్ల వృద్ధుడు మరణించిన విషయం తెలిసిందే. పంజాబ్ లో అదే తొలిమరణం. అయితే కరోనా వైరస్ తేలకముందు ఆ వృద్ధుడు దాదాపు 100మందిని కలిసినట్లు తేలింది. అంతేకాకుండా ఆమన తన మిత్రులతో కలిసి 15గ్రామాలను సందర్శించారు. అయితే ఇప్పుడు ఆయన కలిసిన 100మందిలో ఉన్న 23మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది.

రాష్ట్రం మొత్తం మీద నమోదైన 33కేసుల్లో 23మందికి ఆ వృద్ధుడు ద్వారానే కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పుడు ఆయన పర్యటించిన పంజాబ్ లోని 15 గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అధికారులు 15గ్రామాలకు సీల్ వేశారు. 

మరణించిన 70 ఏళ్ల వృద్ధుడు గురుద్వార మతపెద్దగా వ్యవహరించేవారు. ఆయన తన ఇద్దరు సన్నిహితులతో కలిసి కొన్ని రోజుల క్రితం జర్మనీ, ఇటలీ పర్యటనకు వెళ్లారు. రెండు వారాలు అక్కడే ఉండి.. మార్చి 6న స్వస్థలానికి వచ్చారు. అనంతరం మార్చి 8-10 వరకు ఆనంద్‌పూర్‌ సాహిబ్‌ వద్ద జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత దాదాపు 15 గ్రామాల్లో పర్యటించి వంద మందిని కలిశారు.

ఆ తర్వాత ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ  మార్చి 18న ఆయన మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యుల్లో దాదాపు 14 మందికి కరోనా అంటుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సదరు వృద్ధుడిని కలిసిన వారందరి దగ్గరకు వెళ్లి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు.

15 గ్రామాల వ్యక్తులు విధిగా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా నవన్షార్‌, మొహాలీ, అమృత్‌సర్‌, హోషియాపూర్‌, జలంధర్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా భారత్‌లో ఇప్పటివరకు 700 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 17 మరణాలు నమోదయ్యాయి.

Also Read | అనారోగ్యంతో మహిళ మృతి.. కరోనా భయంతో దగ్గరకు రాని బంధువులు.. చెత్తబండిలో తీసుకెళ్లి అంత్యక్రియలు!