Puri Jagannath Temple Ratna Bhandar history and Secret chamber details
Puri Jagannath Temple Ratna Bhandar: వందల ఏళ్లనాటి అపార సంపద. ఆ పురాతన ఆభరణాలపై ఎన్నో ఊహాగానాలు. లెక్కలేనన్ని మణులు మాణిక్యాలు, వజ్ర, వైఢూర్యాలున్న రత్న భండార్ రహస్యం ఇన్నాళ్లు మిస్టరీగానే ఉండిపోయింది. ఇప్పుడు గుట్టువిప్పి.. యావత్ దేశ ప్రజలకు అందులో ఉన్న సంపద ఏంటో చూపించేందుకు రెడీ అయింది ఒడిశా సర్కార్. పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. ఆలయ గర్బగుడి దగ్గరలోని రత్న భండార్‌లో వజ్రాలు, బంగారం, వెండితో చేసిన వస్తువులు, దేవదేవుని అమూల్యమైన ఆభరణాలున్నాయి.
పూరీ రత్న భండార్‌లో 11.78 మీటర్ల ఎత్తులో 8.79 మీటర్ల పొడవు.. 6.74 మీటర్ల వెడల్పుతో మూడు గదులున్నాయి. ఒక గదిని అంతర్గత ఖజానాగా పిలుస్తారు. రెండో గదిని బయటి ఖజానా అంటారు. రెండు గదుల్లో 128 కిలోల 380 గ్రాముల బరువుతో 454 బంగారు వస్తువులు, 221 కిలోల 530 కిలోల బరువున్న 293 వెండి వస్తువులు ఉన్నట్టుగా గుర్తించారు. అంతర్గత ఖజానాలో 43కిలోల 640 గ్రాముల 367రకాల బంగారు వస్తువులు, 148కిలోల 780 గ్రాముల 231 వెండి వస్తువులున్నాయి. లోపలి గదిలో 180 రకాల స్వర్ణాభరణాలు, 146 వెండి ఆభరణాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. బయటి గదిలో 150 స్వర్ణాభరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మూడో గదిని మాత్రం ఇప్పటివరకు తేరవలేదు.
లెక్కించడానికి 70 రోజుల సమయం
బ్రిటిష్ కాలంలో 1805 జూన్ 10న తొలిసారి అధికారికంగా ఆభరణాలు, సంపద లెక్కింపు జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం 64 స్వర్ణ, రజత ఆభరణాలు ఉన్నాయని.. అవి అత్యంత విలువైనవి అంటున్నారు. అవన్నీ వజ్రవైడూర్యాలు, కెంపులు, మణులు, ముత్యాలతో డిజైన్ చేసి ఉన్నట్లు చెబుతున్నారు. 128 బంగారు నాణేలు, 24 బంగారు మొహర్లు.. 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1,333 రకాల వస్త్రాలు ఉన్నాయి. 1926లో మరోసారి లెక్కించినట్లు తెలుస్తోంది. చివరిసారిగా 1978 మే 13, జూలై 23 మధ్యలో రత్న భాండాగారాన్ని తెరిచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి.. 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 5 చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజుల సమయం పట్టింది.
రత్నభండార్‌లో ఏముందో?
నాలుగు దశాబ్దాల తర్వాత తెరుచుకోనున్న రత్నభండార్‌లో ఏముందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. రాజుల నుంచి సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథస్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. అయితే రత్నభండార్‌లోని మూడో గదికి మూడు తలుపులు ఉన్నాయని.. మూడో తలుపు తాళం పోయిందని ప్రచారం జరిగింది.. బిజూజనతాదళ్ పాలనలోనే రత్నభండార్ మూడో తలుపు తాళం చెవి పోగొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ మొన్నటి ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లింది. రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రథ్ కమిటీని వేసి.. రత్నభండార్ తలుపులు తెరిచి.. సంపద లెక్కిస్తామన్న హామీని నిలబెట్టుకునేందుకు రెడీ అయింది.
తాళం చెవి అదృశ్యం
ఇక ఈ రత్నభండార్‌లో పెద్ద సింహాసనం, జగన్నాథ, బలభద్రులకు భక్తులు సమర్పించిన అరటిపువ్వు ఆకృతి చెవిదిద్దులు ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలున్నాయి. 12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంత రాజుల కిరీటాలు, యుద్ధంలో గెల్చుకున్న విలువైన సొత్తునూ రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది. పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల భద్రత కోసం రత్న భండార్ తలుపులు తెరవాలని ఆరేళ్ల క్రితం హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 4, 2018న 16 మంది సభ్యుల భారత పురావస్తుశాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది. అయితే తాళం చెవి అదృశ్యమైందన్న వార్తల నడుమ వెనుతిరిగింది.
Also Read : రత్నభండార్ మిస్టరీ.. మూడో గదిని తెరిస్తే మటాషేనా, మామూలు మనుషులు తెరవలేరా?
15 వందల ఏళ్ల నాటి ఆభరణాలు
దాదాపు 46 ఏళ్ల తర్వాత పూరీ జగన్నాథుని ఆలయంలోని భాండాగారాన్ని తెరవనున్నారు. జగన్నాథుడి వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి ఇతర బరువు, నాణ్యత పరిశీలించడానికి ఎక్స్‌పర్ట్స్ అవసరం. ఆడిట్ ప్రాసెస్‌కు కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ఖజానాలో 15 వందల ఏళ్ల క్రితం ఉన్న ఆభరణాలు, నగలు కూడా ఉన్నాయని బిశ్వనాథ్ రథ్ కమిటీ చెబుతోంది. అయితే ఈ ఆభరణాలను గుర్తించేందుకు నిపుణులైన స్వర్ణకారులు, మెట్రాలజిస్టుల టీమ్‌ను అందుబాటులో ఉంచనున్నారు. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సభ్యులు కేవలం ఆభరణాల లెక్కింపును మాత్రమే పర్యవేక్షిస్తారు. రత్న భాండాగారంలోనే నగల లెక్కింపు సాధ్యం కాదంటున్నారు అధికారులు. ఈ సంపదను మరోచోటికి తరలించి పటిష్ఠ భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది. సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాల సమక్షంలో లెక్కింపు, నాణ్యతను పరిశీలించనున్నారు. గట్టి భద్రత మధ్య లెక్కింపు జరగనుంది.