Yogi
Yogi Adityanath : వచ్చే రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. ఆరోపణలు,విమర్శలు,ప్రత్యారోపణలు,ప్రతి విమర్శలతో యూపీ రాజకీయం కాక రేపుతోంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకొని సత్తా చూపాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చూస్తుండగా,ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని,లేకుంటే పార్టీని మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉంచడం కష్టమవుతుందని ఎస్పీ,కాంగ్రెస్,బీఎస్పీలు భావిస్తున్నాయి.
అయితే ముఖ్యంగా పోటీ బీజేపీ-ఎస్పీ మధ్యే ఉండే అవకాశాలున్నాయని తాజా పరిస్థితులు తెలియజేస్తున్నప్పటికీ..కాంగ్రెస్ కూడా ఈ సారి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అందుకే ఇటీవల కాలంలో బీజేపీ పార్టీ..ముఖ్యంగా ఎస్పీతో పాటు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. అటు బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీపై,రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో సోమవారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్..రాహుల్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ యాక్సిడెంటల్ హిందూ అని ఎద్దేవా చేశారు. రాహుల్ తనను తాను హిందువునని ఎప్పటికీ చెప్పుకోలేరని యోగి అన్నారు. రాహుల్ పూర్వీకులు తాము యాక్సిడెంటల్ హిందువులమని చెప్పుకునేవారని యోగి గుర్తు చేశారు.
రాహుల్ కేరళకు వెళ్లి అమేథీకి వ్యతిరేకంగా మాట్లాడతారని, విదేశాలకు వెళ్లి భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడతారని విమర్శించారు. రాహుల్‌లా కాకుండా హిందువులమని గర్వంగా చెప్పాలన్నారు. ఎన్నికల పర్యటనల తర్వాత రాహుల్ గాంధీ మాయమైపోతుంటారని యోగి విమర్శించారు. కాగా,గత వారం రాహుల్ అకస్మాత్తుగా ఇటలీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీకి బాధ్యతల లేదని, కోవిడ్ సమయంలో రాహుల్ ఇటలీ పర్యటన ఎలా చేస్తారంటూ బీజేపీ విమర్శలు గుప్పించగా..వ్యక్తిగత పర్యటనలు రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ కోరిన విషయం తెలిసిందే.
ALSO READ Arvind Kejriwal: ఉత్తరాఖాండ్‌లో గెలిస్తే అమరుల కుటుంబానికి రూ.కోటి చొప్పున ఇస్తాం – కేజ్రీవాల్