తమిళనాడులో జల్లికట్టు, రాహుల్ గాంధీతో ఉదయనిధి స్టాలిన్

Rahul Gandhi and actor Udhayanidhi : తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు ఆటలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లా అవనియాపురంలో జరుగుతున్న జల్లికట్టు వేడుకలకు హాజరయ్యారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. రెండు రోజుల పర్యటనలో భాగంగా తమిళనాడుకు వచ్చిన రాహుల్‌ గాంధీ..2021, జనవరి 14వ తేదీ గురువారం అవనియాపురానికి వెళ్లారు. ఎద్దులను పట్టుకునేందుకు యువకులు పోటీపడుతున్న దృశ్యాలను తిలకించారు. పోటీల్లో పాల్గొనే యువకులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం జల్లికట్టు ప్రాధాన్యత గురించి అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు.

వనియాపురంలో జరుగుతున్న జల్లికట్టు వేడుకలకు..తమిళ్‌ హీరో ఉదయనిదిస్టాలిన్‌ కూడా హాజరయ్యారు. ఉదయనిది స్టాలిన్‌ జల్లికట్టు పోటీలను తిలకిస్తుండగా..అదే సమయంలో రాహుల్‌ గాంధీ అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కలుసుకున్న వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాహుల్, ఉదయనిధి స్టాలిన్ ఇలా ఒకేచోట కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం రాహుల్..నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొనున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి వెల్లడించారు.

మొత్తం నాలుగు గంటల పాటు రాహుల్ మధురైలో పర్యటించనున్నారు. మరికొద్ది రోజుల్లో తమిళనాడులో ఎన్నికల జరగనుండగా.. రాహుల్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళ ప్రజలను ఆకట్టుకునేందుకు, వారి మనోభావాలను గౌరవిస్తున్నామని చెప్పేలా జల్లికట్టు ఆటను చేసేందుకు రాహుల్ వస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కీలక నేతలతో భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి, డీఎంకేతో దోస్తీని ఎలా బలోపేతం చేయాలని రాహుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.