రాహుల్,ప్రియంకకు ఝలక్ ఇచ్చిన యూపీ పోలీసులు

కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలకు యూపీ పోలీసులు ఝలక్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మీరట్ వెళ్తున్న రాహుల్,ప్రియాంక కారును యూపీ పోలీసులు అడ్డుకున్నారు. వారిని మీరట్ సిటీలోకి అడుగుపెట్టనీయలేదు.

దీంతో వారు తమ పర్యటనను వాయిదా వేసుకుని మీరట్ సిటీ బయటినుంచే ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. మీరట్ లో పెద్దసంఖ్యలో ప్రజలు గుమికూడటంపై నిషేధం కొనసాగుతుందని,అందువల్ల రాహుల్,ప్రియాంకను సిటీలోకి అనుమతించలేదని పోలీసులు తెలిపారు. కాగా శనివారం రోజు బిజ్నోర్ వెళ్లి ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరి కుటుంబాలను ప్రియాంకగాంధీ పరామర్శించిన విషయం తెలిసిందే.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో యూపీలో అధికారికంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే అనధికారికంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 12వరకు ఉన్నట్లు తెలుస్తోంది. యూపీలోని పలు చోట్ల ఇప్పటికీ నిషేదాజ్ఞలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఆందోళనకారులకు యూపీ సీఎం గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే వారిని సీసీపుటేజీ ద్వారా గుర్తించి వారి ఆస్తులను వేలం వేసి ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని ఆందోళనకారులకు యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చారు.