గుడ్ టీం వర్క్ తో ఎన్నో విజయాలు సాధించవచ్చునని నిరూపించారు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాజకీయాల్లోనే కాదు.. ఏ రంగంలోనైనా టీం వర్క్ తోనే అద్భుతాలు సృష్టించవచ్చునని రాహుల్ తన చేతల్లో చేసి చూపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ మరింత యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. జనంలోకి దూసుకెళ్లటం, వాళ్లతో మాట్లాడటం, ప్రొటోకాల్ ను పక్కన పెట్టి మరీ జనంలో మమేకం అవుతూ వచ్చారు. లేటెస్ట్ గా హెలికాఫ్టర్ రిపేర్ చేస్తూ కనిపించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో శుక్రవారం (మే 10, 2019)న రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరిగి ఢిల్లీ బయలుదేరారు. అంతలోనే హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. పైలెట్లు, ఇతర సిబ్బంది కంగారు పడ్డారు. రాహుల్ మాత్రం కూల్ గా ఉన్నారు. హెలికాఫ్టర్ లో కూర్చున్న ఆయన కిందకు దిగారు. టెక్నికల్ టీంతో కలిసి రిపేర్ చేయటం మొదలుపెట్టారు. కింద పడుకుని మరీ హెలికాఫ్టర్ డోర్లకు సంబంధించిన స్క్రూల్ లను సరి చేశారు.
టెక్నికల్ సిబ్బందికి తన వంతు సాయం అందించారు. రాహుల్ తన ఇన్ స్ట్రాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అందరూ కలిసి తలో చేయ్యేసి.. ‘గుడ్ టీం వర్క్’ గా పనిచేయడం వల్లే హెలికాప్టర్ లో తలెత్తిన సమస్యను త్వరగా ఫిక్స్ చేయడం సాధ్యపడిందని ఆయన పోస్టులో తెలిపారు.
రాహుల్ గాంధీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్టు చేసిన ఈ వీడియోకు 85వేలకు పైగా లైక్స్ రాగా, వేలాది కామెంట్లు వచ్చాయి. పార్టీకే కాదు.. హెలికాఫ్టర్ కు కూడా రిపేరు చేస్తున్నారని కొందరు అంటే.. రాహుల్ లో మెకానిక్ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు మరికొందరు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏడో దశ పోలింగ్ హిమాచల్ ప్రదేశ్ లో మే 19 నుంచి జరుగనున్నాయి. మే 23న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.