Rahul Gandhi Bharat Jodo Yatra: కొచ్చి నుంచి ప్రారంభమైన 14వరోజు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’.. భారీ సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం 14వ రోజు భారత్ జోడో యాత్రను కేరళలోని కొచ్చి నుంచి ప్రారంభించారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. నేటి ఉదయం పాదయాత్ర ప్రారంభ సమయంలో రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ కూడా రాహుల్ గాంధీ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. ఉదయం పాదయాత్ర ప్రారంభ సమయంలో రాహుల్ గాంధీ ఆధ్యాత్మిక వేత్త, తత్వవేత్త, సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు చిత్రపటానికి నివాళులర్పించారు. 14వ రోజు యాత్రలో భాగంగా ఉదయం 6.30 గంటలకు కొచ్చిలోని మాదవన నుంచి యాత్రను రాహుల్ ప్రారంభించారు. అక్కడి నుంచి ఎడపల్లి వరకు 13 కిలోమీటర్ల మేర పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి రాహుల్ పాదయాత్రలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ఎడపల్లి వద్ద ఎస్టీ గార్గే చర్చి వద్ద రాహుల్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలతో రాహుల్ సమావేశం అవుతారు. సాయంత్రం 5గంటలకు కలమస్సేరి మున్సిపల్ కార్యాలయం నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుంది. రాత్రి 7గంటలకు పరవోర్ జక్షన్ కు చేరుకుంటుంది. కొచ్చిలోని అలువా వద్ద యూసీ కాలేజ్ లో రాహుల్ గాంధీ బస చేయనున్నారు.













