టికెట్ లేని ప్రయాణం నేరం.. తప్పదు చెల్లించక భారీ మూల్యం… రైళ్లలో రాసి ఉండే హెచ్చరికల రాతలు ఇవి. రైళ్లల్లో, బస్సులో ఈ హెచ్చరికలు చదివుతుంటాం కదా? అయితే పట్టుకుంటే రూ.500లో లేక రూ.వెయ్యి కట్టక తప్పదు. దేశవ్యాప్తంగా రైళ్లలో అలా ప్రయాణించి వసూలు చేసిన మొత్తం భారీగానే ఉంటుందట.. ఇటీవల వచ్చిన అంచనాలను బట్టి చూస్తే ఏడాదికి వందల కోట్ల ఆదాయం వీటి ద్వారానే వస్తుంది.
ఇదిలా ఉంటే.. ముంబై హెడ్ క్వార్టర్‌గా పని చేస్తున్న సెంట్రల్ రైల్వే జోన్ కేవలం 9 నెలల్లో రూ.155.14 కోట్ల ఫైన్ వసూలు చేసిందట. ఈ ఫైన్లు మొత్తం టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచే. అయితే తొమ్మిది నెలల కాలంలో సెంట్రల్ రైల్వేలో అందులో పనిచేస్తున్న రైల్వే టీసీలు రికార్డు స్థాయి టిక్కెట్లు లేనివారి నుంచి వసూళ్లు చేశారు. ఒక్కొక్కరు రూ.కోటిపైగా ఫైన్లు వసూలు చెయ్యడం గమనార్హం.
టికెట్ లేని ప్రయాణం చేయాలంటేనే హడల్ పుట్టించేలా ఎస్బీ గలండే అనే టికెట్ కలెక్టర్ 22,680 మంది టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారిని పట్టుకుని, రూ.1.51 కోట్ల ఫైన్లు వసూలు చేసి టాప్‌లో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో రవి కుమార్ అనే టీసీ 20,657 మంది నుంచి రూ.1.45 కోట్లు.. ఎంఎం షిండే అనే టీసీ 16,035 మంది ప్రయాణికుల నుంచి రూ.1.07 కోట్లు, మరో టీసీ డి.కుమార్ అనే టీసీ 15,264 మంది నుంచి రూ.1.02 కోట్ల ఫైన్ వసూలు చేశారు. భారీగా జరిమానాల రూపంలో రైల్వేకి ఆదాయం తెచ్చిన ఈ నలుగురు టీసీలను సెంట్రల్ రైల్వే అధికారులు అభినందించారు.