లాక్‌డౌన్ పొడిగింపు ఉండదు.. ఆరోజు నుంచే రైళ్లు అందుబాటులోకి!

  • Publish Date - April 2, 2020 / 04:52 AM IST

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుంది. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లే అవకాశమే లేదు ఎక్కడా కూడా.. ఈ క్రమంలో ప్రజా రవాణా వ్యవస్థ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని వార్తలు వినిపిస్తుండగా.. రైల్వే ప్రయాణికులకు ఆ ఇబ్బంది లేదనట్లుగా సంకేతాలు ఇచ్చేసింది కేంద్రం. ఏప్రిల్ 15వ తేదీ నుంచి రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.

అయితే పూర్తిగా అన్నీ రైళ్లు అందుబాటులోకి రావట.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కొన్ని రైళ్ల సేవలను పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆ రోజు నుంచి రైల్వే సేవలు పూర్తి స్థాయిలో కాకుండా కొన్ని కొన్నిగా అందుబాటులోకి తీసుకుని వస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ఏప్రిల్ 15 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తుందని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి వెల్లడించారు. 

లాక్‌డౌన్ పూర్తి కాగానే ప్యాసింజర్ సేవలు ఒక్కసారిగా ప్రారంభం కావని, దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రయాణికుల విషయంలో మాత్రం కొన్న జాగ్రత్తలు తీసుకునేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కానీ నిత్యావసర వస్తువులు, ఇతర సరుకులు, వైద్య పరికరాలను రవాణా చేసేందుకు గూడ్స్ రైళ్లను మాత్రం ఎప్పట్లాగే నడుపుతుంది.

రోజుకు 9,000 గూడ్స్  రైళ్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14న ముగియనుండగా.. పొడిగించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అటువంటి అవకాశం లేదని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. 

Also Read | విచిత్రం : పాప పేరు కరోనా..బాబు పేరు లాక్ డౌన్