MLA Balmukund Acharya : రోడ్ల పక్కన మాంసం దుకాణాలన్నీ మూసేయండి : రాజస్థాన్‌లో గెలిచిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యే ఆదేశాలు

రాజస్థాన్ ఎన్నికల్లో ఇలా.. గెలిచారో లేదో అలా.. రోడ్ల పక్కన ఉండే మాంసం దుకాణాలన్నీ మూసేయాలని హుకుం జారీ చేశారు ఓ ఎమ్మెల్యే.

Rajasthan BJP MLA Balmukund Acharya

Rajasthan BJP MLA Balmukund Acharya : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. గెలుపొందిన బీజేపీ అభ్యర్ధుల్లో ఓ స్వామీజీ కూడా ఉన్నారు. ఆయనే బల్ముకుంద్ ఆచార్య. ఆయన రాజస్థాన్ ఎన్నికల్లో ఇలా.. గెలిచారో లేదో అలా రోడ్లపై మాంసం షాపులపై విరుచుకుపడ్డారు. రోడ్ల పక్కన ఉండే మాంసం దుకాణాలన్నీ మూసేయాలని హుకుం జారీ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జైపూర్ లోని హవామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన బల్ముకుంద్ ఆచార్య నాన్ వెజ్ షాపులన్నీ మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. మాంసాలను ఇలా రోడ్లమీద బహిరంగంగా అమ్మటానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు షాపులు మూసేసినట్లుగా సాయంత్రానికల్లా తనకు రిపోర్టు అందాలని పోలీసులకు ఆదేశించారు. అధికారి ఎవరనేది పట్టించుకోనని ఎమ్మెల్యే పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది.

ఈ వీడియోలో ఎమ్మెల్యే బల్ముకుంద్ కాషాయ వస్త్రాలు ధరించి మెడలో పూలలతో ఉన్నారు. జైపూర్‌లోని సిల్వర్ మింట్ రోడ్‌లో నిర్వహిస్తున్న అన్ని ‘చట్టవిరుద్ధమైన’ మాంసం దుకాణాలను వెంటనే మూసివేయాలని సదరు ఎమ్మెల్యే పోలీసు అధికారికి ఫోన్‌లో కఠినంగా ఆదేశించటం వీడియోలో కనిపిస్తోంది.

 

దీనిపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా ఎలా చేస్తారు?? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆదేశాలు సరైనవికాదన్నారు. ఎవరైనా ఒక వ్యక్తి నాన్‌వెజ్‌ ఫుడ్‌ స్టాల్‌ పెట్టాలనుకుంటే దాన్ని ఎవరైనా ఎలా ఆపగలరు..? అని ప్రశ్నించారు.

కాగా.. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాల్ముకుంద్ జైపూర్ లోని హవామహల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై 600 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించింది.69 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ 2వ స్థానానికి పరిమితం కాగా..రాజస్థాన్‌లో 8మంది స్వతంత్రులు విజయం సాధించడం గమనించాల్సిన విషయం. అలాగే మూడు స్థానాల్లో భారత్ ఆదివాసీ పార్టీ విజయం సాధించగా..మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) 2 స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్‌దళ్, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ ఒక్కొక్కటి చొప్పున గెలుచుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు