రసవత్తరంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక.. టీఆర్ఎస్, వైసీపీ ఓట్లే కీలకం

  • Published By: sreehari ,Published On : September 14, 2020 / 08:48 AM IST
రసవత్తరంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక.. టీఆర్ఎస్, వైసీపీ ఓట్లే కీలకం

Updated On : September 14, 2020 / 10:53 AM IST

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ పదవి కోసం మూడు ప్రధాన పార్టీలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని రెండు అధికార పార్టీలైన టీఆర్‌ఎస్‌, వైసీపీ అభ్యర్థుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఒడిశాలోని మరో అధికారపార్టీ బీజేడీ మద్ధతు ఎన్డీయే, యూపీఏ పక్షాలకు కీలకం కావడంతో.. ఇవాళ జరిగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక ఆసక్తి కలిగిస్తోంది.



ఈ పదవి కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు బీహారీ అభ్యర్థులను బరిలోకి దించాయి. ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ పోటీ చేస్తుండగా… ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా ఆర్‌జేడీ ఎంపీ మనోజ్‌ ఝా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ, యూపీఏ పక్షాల అభ్యర్థుల విజయానికి తటస్థ పార్టీలైన బీజేడీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌ మద్దతు కీలకంగా మారింది.



రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవి కోసం ఒకవైపు ఎన్‌డీఏ, మరోవైపు ప్రతిపక్ష కూటములు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులకుగాను… 244 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 123 మంది మద్దతు పొందినవారికి డిప్యూటీ చైర్మన్‌ పదవి దక్కుతుంది. సొంతంగా 87మంది రాజ్యసభ సభ్యుల బలం కలిగిన అధికార బీజేపీకి.. తమ మిత్రపక్షాలతో కలిపి మొత్తం 101 మంది సభ్యుల బలం ఉంది.
https://10tv.in/rajya-sabha-deputy-chairman-poll/
తటస్థంగా ఉన్న సభ్యులను తమవైపు తిప్పుకుని సునాయాసంగా డిప్యూటీ చైర్మన్‌ గెలుచుకోవచ్చని ఎన్‌డీఏ కూటమి భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బీజేడీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల మద్దతు కోరింది. దీంతో ప్రస్తుతం ఈ మూడు పార్టీల ఓట్లు కీలకం కానున్నాయి. రాజ్యసభలో టీఆర్‌ఎస్‌కు ఏడు, వైసీపీకి ఆరు, బీజేడీకి 9మంది సభ్యుల బలం ఉంది.



ఈ మూడు పార్టీల సభ్యులు కలిపితే 22 మంది ఉన్నారు. ఈ 22మంది సభ్యులు ఎన్‌డీఏకు మద్ధతిస్తే దానిబలం 123కు పెరుగుతుంది. దీంతో డిప్యూటీ చైర్మన్‌ పదవి ఎన్‌డీఏ కూటమి గెల్చుకునే అవకాశముంది. అయితే పార్టీలు ఎన్‌డీఏకు మద్ధతు ఇవ్వడంపై ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక పోటీ లేకుండా జరగరాదన్న ఉద్దేశంతోనే సంఖ్యబలం లేకపోయినా.. అభ్యర్థిని బరిలోకి దించింది యూపీఏ. కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలోని యూపీఏ పార్టీలతోపాటు… బీజేపీని వ్యతిరేకించే కొన్ని పార్టీలు కూడా కలిపితే ఆర్‌జేడీ ఎంపీ మనోజ్‌ ఝాను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల బరిలో నిలిపాయి. ప్రస్తుతం రాజ్యసభలో యూపీఏ కూటమి బలం 91మంది. బీఎస్పీ, ఆప్‌ ఎంపీలను కలిపితే ఈ సంఖ్య 95కు చేరుతుంది. అయితే ఈ రెండు పార్టీలు కూడా ఇంకా యూపీఏకు మద్ధతు ప్రకటించలేదు.



కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలోని విపక్ష కూటమిలో ఎస్పీ, టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే, శివసేన, జేఎంఎం, కేరళ కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, ముస్లింలీగ్‌లాంటి పార్టీలు చేరిపోయాయి. మనోజ్‌ ఝాకు అవి మద్ధతు ప్రకటించాయి. ఇక ఎటూ మద్దతు తెలుపని టీఆర్‌ఎస్‌, వైసీపీ, బీజేడీ మద్దతు ఇరు పక్షాలకు కీలకమే. ఈ మూడు పార్టీల సభ్యులను ప్రసన్నం చేసుకునేందుకు ఇరు కూటములు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. సంఖ్యాపరంగా చూస్తే.. తటస్థ పార్టీలు మద్ధతిస్తే… గెలుపొందే అవకాశాలు ఎన్డీఏకే ఎక్కువగా ఉన్నాయి. కానీ బీజేడీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌లు తమ మద్దతు ఎవరికీ ప్రకటించకపోవడంతో… డిప్యూటీ చైర్మన్‌ పదవి ఏ కూటమిని వరిస్తుందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.