RAMPS IN POLITICAL MEETINGS
వందల ఎకరాల్లో సభలు.. లక్షలాది జనం.. డ్రోన్ కెమెరాలు.. హెలికాప్టర్లలో లీడర్ల రాక. ఇలా ప్రచారాలకు హైటెక్ హంగులు అద్దుతున్నాయి రాజకీయ పార్టీలు. ఒకప్పటికి ఇప్పటికీ పార్టీల ప్రచారంలో జమీన్ ఆస్మాన్ ఫరక్ కనిపిస్తోంది. ప్రజల ఆలోచనతీరులో మార్పులు వస్తున్నట్లుగా.. రాజకీయ నేతలు కూడా కొత్తగా ఆలోచిస్తున్నారు. పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఇచ్చే సూచనలతో జనాలను ఆకట్టుకునేలా ఈవెంట్ మేనేజర్స్‌తో బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రచారంలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నాయి పార్టీలు.
పబ్లిక్ మీటింగ్ అంటే లెక్కలే మారిపోయాయి. అరేంజ్‌మెంట్స్ తీరే ఛేంజ్ అయింది. కొన్నాళ్లుగా రాజకీయ పార్టీల సభల్లో ర్యాంపులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ప్రధాని మోదీ నుంచి రేవంత్ రెడ్డి వరకు.. ఒకొక్కరు ఒక్కో విధంగా జనాల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళనాడులో స్టాలిన్ మీటింగుల్లో ర్యాంపు సెటప్ పెట్టడం స్టార్ట్ అయింది.
భారీగా జనసమీకరణ చేసి.. అందులో వంద మీటర్ల పొడవు ర్యాంపు పెట్టి అక్కడ నుంచి మళ్లీ V షేప్ లో కర్వు ఇస్తారు. ఇక సభకు వచ్చిన లీడర్.. ఆ ర్యాంపుపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారు. ర్యాంపుపై నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకెళ్లి.. తిరిగి డయాస్ మీదకు తిరిగి వచ్చే వరకు ఓ పదిహేను నిమిషాల టైమ్ పడుతుంది.
గతంలో అయితే లీడర్ స్టేజ్ మీద నిలబడే అభివాదం చేసి మాట్లాడి వెళ్లిపోయేవారు. సభకు వచ్చిన జనాలందరికీ తన అభిమాన నేత కనిపించేవారు కాదు. సభలో ముందు వరుసలో..స్టేజ్ కు కుడి, ఎడమవైపు ఉన్నవారికి మాత్రమే లీడర్ కనిపించేవారు. మిగతా జనం లీడర్ ను చూడకుండానే అతని ప్రసంగం విని సభ నుంచి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది.
ఈ ర్యాంపు ట్రెండ్ తో లీడర్ జనాలకు దగ్గర వరకు వెళ్లే వీలుంటుంది. సభకు వచ్చిన జనమంతా ముఖ్య అతిథిని చూసే వీలుంటుంది. సేమ్ టైమ్ లీడర్ ర్యాంపుపై నడుస్తూ అభివాదం చేస్తున్నంత సేపు సభ అటెన్షన్ మొత్తం లీడర్ మీదే ఉంటుంది. చాలామంది షేక్ హ్యాండ్ ఇవ్వడం..బారీ కేడ్స్ దాటుకొని ఎత్తులో ర్యాంపుపైకి ఎక్కి తమ నేతతో ఫోటో దిగిన సందర్భాలు ఉన్నాయి.
పబ్లిక్ మీటింగ్ రూపురేఖలే మారి..
ఈ ర్యాంపు ట్రెండ్ తో పబ్లిక్ మీటింగ్ రూపురేఖలే మారిపోయాయి. స్టాలిన్ తర్వాత దీదీ పశ్చిమబెంగాల్ లో ట్రెండ్ ఫాలో అయ్యారు. టీఎంసీ మీటింగులన్నింటిలో ఈ ర్యాంపు ఏర్పాటు చేస్తున్నారు.
తెలుగురాష్ట్రాల్లో వైఎస్ జగన్.. బహిరంగసభల్లో ర్యాంపు ట్రెండ్ ను మొదట ఫాలో అయ్యారు. 2019 ఎన్నికల ముందు నుంచి తన పబ్లిక్ మీటింగుల్లో ర్యాంప్ ఏర్పాటు చేసి.. దానిపై నడుచుకుంటూ సభకు వచ్చిన జనాలు అభివాదం చేస్తున్నారు జగన్. ఆ ర్యాంపుపై నడుస్తూ అభివాదం చేస్తున్న క్రమంలో మీటింగ్ వచ్చిన జనాలు ఇచ్చే వినతిపత్రాలు కూడా తీసుకుంటున్నారు.
మోదీ.. రేవంత్..
ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన సభలో.. ర్యాంప్‌పై నడుస్తూ మహిళలకు అభివాదం చేశారు. క్యాంపెయిన్‌లో ప్రధాని మోదీది కొత్త ట్రెండ్. కిలోమీటర్ల దూరం రోడ్ షోలతో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతారు మోదీ. పబ్లిక్ మీటింగ్ లకు వెళ్తే మాత్రం.. ఓపెన్ టాప్ జీపు, లేకపోతే తన కారులో నిలబడి.. అభివాదం చేసుకుంటూ స్టేజ్ దగ్గరకు చేరుకుంటారు. ఈ క్రమంలో మోదీపై పూలవర్షం కురిపిస్తారు అభిమానులు.
ఇలా ఒక్కోనేత ఒక్కో విధంగా జనాలను ఆకట్టుకునేందుకు ప్రచార శైలిని మారుస్తున్నారు. బహిరంగ సభల్లో ర్యాంపు సెటప్ అయితే జనాలకు బాగా ఆకట్టుకుంటోంది.
Also Read: ఎన్నికల వేళ ఉండి నియోజకవర్గం టీడీపీలో మరింత ముదిరిన వివాదం