Sanjay Raut: మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: సంజయ్ రౌత్
ఈ ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు.

మహారాష్ట్ర ఎన్నికల వేళ ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. బ్యాలెట్ పేపర్లను వాడి మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని సంజయ్ రౌత్ సోమవారం డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 288 స్థానాలకు గాను 230 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ 46 స్థానాలను గెలుచుకుంది. శివసేన (యూబీటీ) 95 సీట్లలో పోటీ చేయగా కేవలం 20 మాత్రమే గెలుచుకుంది.
దీనిపై ఇవాళ ముంబైలో సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలకు సంబంధించి తమకు దాదాపు 450 ఫిర్యాదులు అందాయని తెలిపారు. పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ అంశాలపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు.
ఈ ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. అందుకే ఫలితాలను పక్కనబెట్టి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. కొందరు మహాయుతి అభ్యర్థులు భారీ తేడాతో విజయం సాధించడంపై సంజయ్ రౌత్ అనుమానాలు వ్యక్తం చేశారు.
వారు చేసిన విప్లవాత్మక పనులు ఏమున్నాయని, అంత భారీ మెజార్టీతో వారు ఎలా గెలుస్తారని సంజయ్ రౌత్ అన్నారు. ఇటీవల పార్టీలు మారిన నేతలు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారని చెప్పారు. ఇది అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. శరద్ పవార్ వంటి సీనియర్ నాయకుడు తొలిసారిగా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారని, దీనిని విస్మరించలేమని అన్నారు.
PM Modi: వారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించరు.. విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం