Reduce Vaccine Price Govt Tells Serum Bharat Biotech
vaccine price కరోనా వ్యాక్సిన్ ధరలను తగ్గించాలని వ్యాక్సిన్ తయారీ సంస్థలు భారత్ బయోటెక్,సీరం ఇనిస్టిట్యూట్ లను కేంద్రప్రభుత్వం కోరింది. మే-1నుంచి దేశంలో 18ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాల్సి ఉండటం మరియు కరోనా కల్లోల సమయంలో లాభాల కోసం ఉత్పత్తి సంస్థలు ఆశించడం తగదంటూ పలు రాష్ట్రాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజా విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్రం చేసిన విజ్ఞప్తితో రెండు సంస్థలు సవరించిన ధరలతో ఒక ప్రకటన చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కాగా,ప్రస్తుతం హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ‘కొవాగ్జిన్’ ఒక్కో డోసును రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600 చొప్పున, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1,200 చొప్పున ఇస్తోంది. ఇక,పూణేకి చెందిన సిరం సంస్థ ‘కోవిషీల్డ్’ ధరను రాష్ట్రాలకు రూ.400,ప్రైవేట్ హాస్పిటల్స్ కు రూ.600కి అందిస్తోంది. అయితే, రెండు వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్రప్రభుత్వానికి ఒక్కో డోసుని రూ.150కి అందిస్తోన్న విషయం తెలిసిందే.