Cooking Oil
కేంద్ర ప్రభుత్వం ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 20% నుంచి 10%కి తగ్గించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుంది. భారతదేశం తన వంట నూనెల అవసరాల్లో 50% పైగా దిగుమతులపై ఆధారపడుతుంది.
ఇటీవల అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు పెరిగి, దేశీయ మార్కెట్లో కూడా ధరలు పెరిగాయి. రిఫైన్డ్ వంట నూనెల దిగుమతులు గణనీయంగా పెరిగి, స్థానిక రిఫైనరీలకు నష్టం కలుగుతోంది. ముడి వంట నూనెలపై సుంకం తగ్గించడం వల్ల వినియోగదారులకు వంట నూనెల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు.
Also Read: మీకు ఎందుకు ఈ కక్ష? మళ్లీ ఈ కష్టాలను ఎందుకు తెస్తున్నారు?: చంద్రబాబుపై జగన్ నిప్పులు
రిఫైన్డ్ వంట నూనెలపై సుంకం 35.75% గా యథాతథంగా ఉంది. ముడి నూనెలపై సుంకం తగ్గించి, రిఫైన్డ్ నూనెలపై ఎక్కువ సుంకం ఉండటం వలన ముడి నూనెల దిగుమతులు పెరిగి, దేశీయ రిఫైనరీలకు ప్రయోజనం కలుగుతుంది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA), ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) చాలా కాలంగా ముడి, శుద్ధి చేసిన నూనెల మధ్య సుంకం తేడాను 8.25% నుంచి 19.25%కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.
అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ వంటి ఇతర ఛార్జీలతో కలిపి ముడి వంట నూనెలపై సుంకం 16.5%కి తగ్గింది. పరిశ్రమలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, దేశీయ రిఫైనింగ్ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ఇది సహాయపడుతుందని అభిప్రాయపడ్డాయి. కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయం వంట నూనెల ధరలు తగ్గించడంతో పాటు క్వాలిటీ ఉన్న నూనెలు తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు భావిస్తున్నారు.