Renuka Chowdhury
Renuka Chowdhury: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఇవాళ ఓ కుక్కపిల్లను పార్లమెంటుకు తీసుకొచ్చారు. ఆ కుక్కపిల్లను చూసిన వారందరూ షాక్ అయ్యారు.
ఆ కుక్కపిల్ల ఎవరినైనా కరిస్తే పరిస్థితి ఏంటని కొందరు ఆందోళన చెందారు. దీనిపై రేణుకా చౌదరి (Renuka Chowdhury) స్పందిస్తూ.. “కరిచేవాళ్లు పార్లమెంట్ లోపల కూర్చున్నారు” అంటూ కామెంట్స్ చేశారు. రేణుకాచౌదరి ఆ కుక్కపిల్లను తర్వాత కారులో ఇంటికి పంపారు.
కుక్కపిల్లను ఆమె కేంద్ర మంత్రులు, ఎంపీలతో పోల్చడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. ఆమె కామెంట్లపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చేసిన వ్యాఖ్య పార్లమెంట్‌ను, ఎంపీలను అవమానించడమేనని బీజేపీ నేతలు అన్నారు.
రేణుకాచౌదరి తనపై వచ్చిన విమర్శలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్‌కి కుక్కను తీసుకెళ్లకుండా నిరోధించే ప్రొటోకాల్, చట్టం వంటివి ఏమీ లేవని ఆమె అన్నారు.
Also Read: పవర్ కోచ్‌గా ఆండ్రీ రస్సెల్.. చరిత్రలో ఎప్పుడూలేని కొత్త రోల్.. పవర్ కోచ్ అంటే ఏంటి?
“నేను పార్లమెంట్‌కి వస్తున్న సమయంలో ఈ కుక్కపిల్ల కనిపించింది. వాహనం ఢీకొట్టే ప్రమాదం ఉన్న చోట ఈ కుక్కపిల్ల ఉంది. దీంతో దాన్ని ఎత్తుకుని కారులో తీసుకొచ్చాను. తర్వాత ఇంటికి పంపాను” అని ఆమె చెప్పారు. ప్రాణాన్ని కాపాడేలా తాను చేసిన పనిపై ఎలా అభ్యంతరం చెబుతారని ఆమె ప్రశ్నించారు.
ఆమె తర్వాత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పలు వ్యాఖ్యలు చేశారు. “కరిచేవాళ్లు పార్లమెంట్‌లో కూర్చొని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దాంట్లో సమస్య లేదు కానీ, నేను జంతువు బాగోగులు చూసుకుంటే సమస్య అవుతుందా?” అని చెప్పారు. వీధుల్లో నుంచి పలు కుక్కలను ఇంతకుముందు కూడా తాను దత్తత తీసుకున్నానని తెలిపారు.
బీజేపీ దీనిని డ్రామాగా అభివర్ణించి రేణుకా చౌదరి పార్లమెంట్‌ను అవమానించారని ఆరోపించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ఎంపీలు, సిబ్బందిని రేణుకా చౌదరి కుక్కతో పోల్చారని అన్నారు.
“రేణుకా చౌదరి పార్లమెంట్, ఎంపీలను అవమానించారు. కుక్కను పార్లమెంట్‌కు తెచ్చి, అడిగితే లోపల కరిచేవాళ్లు కూర్చున్నారని అన్నారు. అంటే పార్లమెంట్, సిబ్బంది, ఎంపీలు ఆమె దృష్టిలో కుక్కలు. ఇంతకుముందు కూడా ఆమె ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ సిందూర్‌పై మా సైనికులపై వ్యంగ్యంగా మాట్లాడారు” అని పూనావాలా అన్నారు.
Parliament’s visitors’ galleries have been blessed by a rather special guest, Congress MP Renuka Chowdhury’s pet dog 🐶 #ParliamentWinterSession pic.twitter.com/xl04bjyb3J
— Atishay Jain (@AtishayyJain96) December 1, 2025