×
Ad

Shubhanshu Shukla: శుభాంశు శుక్లాకు ప్రతిష్టాత్మక సైనిక పురస్కారం.. అశోక చక్ర ప్రకటించిన కేంద్రం

2025లో ఆక్సియమ్-4 మిషన్ ద్వారా ఐఎస్‌ఎస్‌లో శుభాంశు శుక్లా అడుగుపెట్టారు. దాదాపు 18 రోజులు అక్కడే గడిపి అనేక కీలక ప్రయోగాలు చేశారు.

Shubhanshu Shukla Representative Image (Image Credit To Original Source)

  • ఐఎస్‌ఎస్‌లోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర
  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా శౌర్య పురస్కారాల ప్రకటన
  • అంతరిక్ష పరిశోధన కేంద్రంలో అడుగుపెట్టి ధైర్య సాహసాలు చూపిన శుక్లా

 

Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అశోక చక్ర పురస్కారం వరించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారాయన. భారత కీర్తి పతాకాన్ని అంతరిక్ష కేంద్రంలో రెపరెపలాడించిన వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాకు అశోక చక్ర పురస్కారం ఇచ్చి గౌరవించింది ప్రభుత్వం.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా శౌర్య పురస్కారాలు (అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర) ప్రకటించింది కేంద్రం. సాయుధ దళాలకు చెందిన 70 మంది సిబ్బందికి శౌర్య పురస్కారాలు వరించాయి. వీరిలో ఆరుగురికి మరణానంతరం ప్రకటించారు. మేజర్ అర్ష్‌దీప్ సింగ్, నాయబ్‌ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బా, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌లకు కీర్తి చక్ర పురస్కారాలు వరించాయి. 13 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్‌ టు సేన పతకం, 44 మందికి సేన, ఆరుగురికి నౌ సేన, ఇద్దరికి వాయుసేన పతకాలు ప్రకటించారు.

సాధారణంగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలతో పాటు ఆర్మీలో సాహసాలు చూపిన వారికి అశోక్ చక్ర అవార్డులతో సత్కరిస్తారు. అయితే అంతరిక్ష పరిశోధన కేంద్రంలో అడుగుపెట్టి తన ధైర్య సాహసాలు చూపిన శుభాంశు శుక్లాకు ఈ అవార్డ్ ప్రకటించారు. 2025 జూన్‌లో ఆక్సియమ్-4 మిషన్ ద్వారా ఐఎస్‌ఎస్‌లో శుభాంశు శుక్లా అడుగుపెట్టారు. దాదాపు 18 రోజులు అక్కడే గడిపి అనేక కీలక ప్రయోగాలు చేశారు. ఐఎస్‌ఎస్‌లో కష్టతరమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని తెగువను చూపించినందుకు గాను శుభాంశు శుక్లాకు అశోక్ చక్ర అవార్డును ప్రకటించింది కేంద్రం.

Also Read: రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్.. పద్మ పురస్కారాలు వరించిన క్రీడాకారులు వీరే