×
Ad

RJD Leader Tears Clothes: ఊకో..ఊకో.. చిన్న పిల్లాడిలా ఏంటిది.. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని.. బట్టలు చించుకుని, రోడ్డుపై పొర్లుతూ రచ్చ రచ్చ..

తనను రూ.2.7 కోట్లు అడిగారని, ఆ డబ్బు ఇవ్వడానికి తాను నిరాకరించడంతో తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారని మదన్ షా ఆరోపించారు.

RJD Leader Tears Clothes: అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం భారీగానే పోటీ ఉంటుంది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు.. అన్ని పార్టీల్లోనూ ఇదే సీన్ కనిపిస్తుంది. ఎమ్మెల్యే టికెట్ కోసం పెద్ద సంఖ్యలో ఆశావహులు ఉంటారు. అయితే, అందరికీ టికెట్ దక్కడం కష్టమే. ఎవరో ఒకరికి మాత్రమే ఇస్తారు. టికెట్ దక్కని వారు తీవ్ర నిరుత్సాహానికి గురవడం చాలా కామన్. అయితే కొందరు చేసే పనులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. టికెట్ దక్కలేదనే బాధలో వారు చేసే పనులు ఒక్కోసారి నవ్వులు పూయిస్తున్నాయి. కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

తాజాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ అలాంటి దృశ్యం ఒకటి కనిపించింది. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ ఓ సీనియర్ నాయకుడు రచ్చ రచ్చ చేశాడు. తనకు టికెట్ ఇవ్వలేదని బట్టలు చించుకున్నాడు. అంతేకాదు.. చిన్నపిల్లాడిలా రోడ్డుపై పొర్లుతూ కంటతడి పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆయన పేరు మదన్ ప్రసాద్ షా. ఆర్జేడీ (రాష్ట్రీయ జనతా దళ్) సీనియర్ నాయకుడు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మధుబన్ టికెట్ ఆశించారు. అయితే, పార్టీ ఆయనను పక్కన పెట్టింది. ఆ టికెట్ మరొకరికి ఇచ్చింది. దీంతో మదన్ షా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటి ముందు నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఆయన చేసిన పని వైరల్ గా మారింది. ఆయన తన బట్టలు చించుకున్నారు. రోడ్డు పై పడుకుని పొర్లుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఎమ్మెల్యే టికెట్ కోసం 2.7 కోట్లు డిమాండ్?

తనను రూ.2.7 కోట్లు అడిగారని, ఆ డబ్బు ఇవ్వడానికి తాను నిరాకరించడంతో తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారని మదన్ షా ఆరోపించారు. “2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు లాలూ ప్రసాద్ యాదవ్ నాకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆర్జేడీ నాయకుడు సంజయ్ యాదవ్ రూ.2.7 కోట్లు డిమాండ్ చేశారు. నేను చెల్లించడానికి నిరాకరించాను. దాంతో పార్టీ టికెట్ వేరొకరికి ఇచ్చారు” అని మదన్ షా చెప్పారు.

ఆర్జేడీ అధినేత లాలూ నివాసం బయట మదన్ షా మాట్లాడారు. “సంజయ్ యాదవ్ ఇదంతా చేస్తున్నాడు. నేను చనిపోవడానికి ఇక్కడికి వచ్చాను. లాలూ యాదవ్ నా గురువు. ఆయన నాకు టికెట్ ఇస్తానని చెప్పారు. కానీ దాన్ని బీజేపీ ఏజెంట్ సంతోష్ కుష్వాహాకు ఇచ్చారు” అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు.

“వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయరు. తేజస్వి చాలా అహంకారి, ప్రజలను కలవరు. 2020లో లాలూ యాదవ్, తేజస్వి యాదవ్ నన్ను రాంచీకి పిలిచారు. విజయావకాశాలపై సర్వే నిర్వహించారు. తేలి కమ్యూనిటీ జనాభాకు సంబంధించి సర్వే చేయించుకున్నారు. మదన్ షా మధుబన్ నియోజకవర్గం నుండి రణధీర్ సింగ్‌ను ఓడిస్తారని కూడా చెప్పారు. తేజస్వీ, లాలూ నాకు ఫోన్ చేసి, టికెట్ ఇస్తామన్నారు. నేను 90ల నుండి పార్టీ కోసం పని చేస్తున్నా. నేను పేదవాడిని, నా భూమిని అమ్మేశాను” అని షా వాపోయారు.

బీహార్ లో 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6న మొదటి దశ, నవంబర్ 11న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెల్లడిస్తారు.

కాగా, టికెట్ ఇవ్వలేదనే కారణంతో బట్టలు చించుకుని, చిన్న పిల్లాడిలా రోడ్డుపై మదన్ షా చేసిన విన్యాసాలు నవ్వులూ పూయిస్తున్నాయి. అయ్యో పాపం అని కొందరు జాలి చూపితే.. మరికొందరు… ఏంటిది చిన్నపిల్లాడిలా.. అంటూ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

Also Read: బుర్ఖాలు, నిఖాబ్‌లపై నిషేధం.. జైలుశిక్ష, జరిమానా కూడా.. పోర్చుగల్ సంచలన నిర్ణయం..