Road Accident In Karntaka
Road Accident : మనిషిలో మానవత్వం కనుమరుగు అవుతోంది. పాపం, జాలి, దయ అనేవి కనిపించడం లేదు. చావు బతుకుల్లోనూ కాఠిన్యంగా వ్యవహరిస్తున్నారు. సాటి మనిషి కళ్ల ముందు తీవ్ర గాయాలతో పడి ఉన్నా, ప్రాణాపాయంలో ఉన్నా కాపాడేందుకు ముందుకు రావడం లేదు. పైగా, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి కర్నాటకలో చోటు చేసుకుంది.
ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చేందుకు బదులు ఫోన్ లో ఆ దృశ్యాలను రికార్డు చేసేందుకు కొందరు వ్యక్తులు శ్రద్ధ చూపారు. దీంతో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. కర్నాటకలోని రాయ్‌చూర్ జిల్లా బైగావత్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దార్థ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాలు విరిగి రోడ్డుపై అచేతనంగా పడి ఉన్న యువకుడిని ఆస్పత్రిలో చేర్చేందుకు స్థానికులెవరూ ముందుకు రాలేదు.
దాదాపు గంటసేపు నెత్తురోడుతున్న గాయాలతో రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న సిద్దార్థ్ కుటుంబ సభ్యులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే చాలా ఆలస్యమైనందున యువకుడు మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు స్పందించి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి ఉంటే, అతడు బతికే వాడని కుటుంబసభ్యులు వాపోయారు. మనుషుల్లో మానవత్వం తగ్గిపోతోందని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నారు. ఫొటోలు, వీడియోలు తీసే దానిలో ఉన్న శ్రద్ధ.. సాటి మనిషిని బతికించడంలో చూపి ఉంటే.. ఓ నిండు ప్రాణం నిలబడేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.