ఒక్కరి ప్రాణం కాపాడేందుకు తలో చేయి వేశారు.. రూ.34 కోట్లు సేకరించారు!

పరాయి దేశంలో మరణశిక్ష పడిన తమ వాడిని కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళ వాసులు ఔదార్యం చూపారు.

Humanity: సౌదీ అరేబియాలో మరణశిక్ష పడిన తమ రాష్ట్రవాసిని రక్షించేందుకు కేరళ ప్రజలు ముందుకు వచ్చారు. మరణశిక్ష పడిన వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు కలిసి కట్టుగా 34 కోట్ల రూపాయలను సేకరించారు. సాటి మనిషి ప్రాణాలు రక్షించేందుకు కేరళ వాసులు చూపిన ఔదార్యం ప్రశంసలు అందుకుంటోంది.

కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో సౌదీ బాలుడిని హత్య చేశాడనే ఆరోపణలతో గల్ఫ్ దేశంలో 18 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు. సౌదీలో దివ్యాంగుడైన బాలుడికి అబ్దుల్ రహీమ్ సంరక్షుడిగా ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు ఆ బాలుడు చనిపోయాడు. దీంతో అబ్దుల్ రహీమ్ జైలు పాలయ్యాడు. అతడికి క్షమాభిక్ష పెట్టేందుకు బాలుడు కుటుంబం నిరాకరించడంతో 2018లో స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది.

ఉన్నత న్యాయస్థానాలకు వెళ్లినా శిక్ష మారలేదు. మానవతావాదుల జోక్యంతో క్షమాభిక్షకు బాలుడి కుటుంబం అంగీకరించింది. గల్ఫ్ చట్టాల ప్రకారం బాధిత కుటుంబానికి నిందితుడు భారీ మొత్తంలో బ్లడ్ మనీ చెల్లించాల్సి ఉంటుంది. అబ్దుల్ రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు కొంతమంది సామాజిక సేవా కార్యకర్తలు యాక్షన్ కమిటీగా ఏర్పడి విరాళాల సేకరణ మొదలుపెట్టారు. పారదర్శకంగా డొనేషన్స్ తీసుకునేందుకు మొబైల్ యాప్ కూడా రూపొందించారు.

Also Read: ఖరీదైన షూలు దొంగిలించిన స్విగ్గీ డెలివరీ బాయ్.. మద్దతుగా నిలిచిన సోనూసూద్!

ఐదు రోజుల క్రితం వరకు చాలా తక్కువ మొత్తాన్నే యాక్షన్ కమిటీ సేకరించగలిగింది. వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని తీవ్రతరం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళ ప్రజల నుంచి భారీ మొత్తంలో సహాయం అందిందని నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. “రియాద్‌లోని 75కి పైగా సంస్థలు, కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మన్నూర్, రాష్ట్రంలోని వివిధ రాజకీయ సంస్థలు, సామాన్య ప్రజలు అందరూ డబ్బును సేకరించడానికి మాకు సహాయం చేశార”ని నిర్వాహడొకరు మీడియాకు తెలిపారు.

అస్సలు ఊహించలేదు: అబ్దుల్ రహీమ్ తల్లి
తన కొడుకు ప్రాణాలు కాపాడేందుకు ఇంత మంది ముందుకు వస్తారని, ఇంత పెద్ద మొత్తం సమకూరుతుందని ఎప్పుడూ అనుకోలేదని అబ్దుల్ రహీమ్ తల్లి చెప్పారు. “34 కోట్ల రూపాయల భారీ మొత్తం సేకరించడానికి మాకు ఎలాంటి మార్గం లేనందున నాకు ఎటువంటి ఆశ లేదు. కానీ ఏదో ఒకవిధంగా అదంతా సాధ్యమైంది” అని ఆమె అన్నారు. విరాళాలు ఇచ్చిన వారికి ఆమె ధన్యవాదాలు చెప్పారు. తన కొడుకు త్వరలో జైలు నుంచి బయటకు వస్తాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Also Read: చెన్నై స్వీట్ షాపులో రాహుల్ గాంధీ.. రోడ్డు డివైడర్ దూకి మరీ దుకాణంలోకి..

ట్రెండింగ్ వార్తలు