రాహుల్ గాంధీ చెన్నై పర్యటనలో ఆసక్తికర సన్నివేశం.. వీడియో వైరల్

రాహుల్ గాంధీ సడన్‌గా కారు దిగి.. రోడ్డు డివైడర్ దాటుకుని స్వీట్ షాపులోకి వెళ్లారు. స్వయంగా సీట్లు కొని సీఎం స్టాలిన్‌కు బహుకరించారు.

రాహుల్ గాంధీ చెన్నై పర్యటనలో ఆసక్తికర సన్నివేశం.. వీడియో వైరల్

Rahul Gandhi in Sweet Shop: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చెన్నై పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేటుకుంది. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు బహుకరించేందుకు రాహుల్ గాంధీ స్వయంగా దుకాణానికి వెళ్లి స్వీట్లు కొన్నారు. రోడ్డు మధ్యలోని డివైడర్ దాటుకుని స్వీట్ షాప్ లోకి వెళ్లిన ఆయన.. అక్కడున్న వారిని అప్యాయంగా పలకరించారు. స్వీట్ షాప్ అంతా కలియతిరిగారు. యజమానిని అడిగి స్వీట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని రకాల సీట్లను టేస్ట్ చేశారు.

స్వయంగా డబ్బులిచ్చి మైసూర్ పాక్ కొన్నారు. స్వీట్ షాప్ నుంచి బయటకు వచ్చే ముందే అక్కడ పనిచేసే మహిళలతో ఫొటో దిగారు. తమతో రాహుల్ గాంధీ ఫొటో దిగడంతో సదరు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి నేరుగా స్టాలిన్ నివాసానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. తాను స్వయంగా షాపుకెళ్లి కొనుక్కొచ్చిన స్వీట్లను ఆయనకు బహుకరించారు. ఆత్మీయ ఆలింగనంతో రాహుల్ గాంధీని స్వాగతించారు సీఎం స్టాలిన్. తన కోసం రాహుల్ గాంధీ స్వయంగా షాపుకెళ్లి స్వీట్లు కొనుక్కొచ్చారన్న విషయం తెలుసుకుని స్టాలిన్ ఆశ్చర్యపోయారు.

Also Read: పదేళ్లుగా కాంగ్రెస్ డౌన్‌ఫాల్.. చేజారుతున్న ఒక్కో రాష్ట్రం.. ఎందుకిలా?

రాహుల్ గాంధీ స్వీట్ షాపుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు. ఒకనాడు ఇదే గడ్డపై తండ్రిని కోల్పోయిన రాహుల్ గాంధీ.. ప్రేమ మాత్రమే ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని నమ్మే బలమైన నాయకుడు. దానికి చిన్న ఉదాహరణ ఈ దృశ్యం అంటూ సీఎం రేవంత్ ట్విటర్ లో పేర్కొన్నారు.

 

స్వీట్ విక్టరీ పక్కా!
తనకు సోదరుడు లాంటి వాడైన రాహుల్ గాంధీ ఇచ్చిన ‘తీపి జ్ఞాపకం’ మనసుకు తాకిందని.. జూన్ 4న ఇండియా కచ్చితంగా ఆయనకు మధురమైన విజయాన్ని అందిస్తుందని ట్విటర్ లో పేర్కొన్నారు. కాగా, లోక్‌స‌భ‌ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.