Saif Ali Khan Attack Case: సైఫ్‌పై దాడికేసులో నిందితుడు ముంబై ఎప్పడొచ్చాడు.. సైఫ్ ఇల్లని తెలిసే లోపలికి వెళ్లాడా.. పోలీసులు ఏం చెప్పారంటే..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడిచేసిన నిందితుడ్ని ముంబై పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. థానేలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Saif Ali Khan attack case
Saif Ali Khan Attack Case: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడిచేసిన నిందితుడ్ని ముంబై పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. మహారాష్ట్రలోనే థానేలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ముంబై పోలీస్ డీసీపీ దీక్షిత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుడు పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ గా గుర్తించామని, ప్రాథమిక దర్యాప్తు తరువాత నిందితుడు బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగిందని డీసీపీ తెలిపారు. నిందితుడి వద్ద భారతీయుడు అని చెప్పుకునేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. దీంతో అతనిపై పాస్ పోర్ట్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
నిందితుడు అక్రమంగా భారతదేశంలోకి చొరబడ్డాడు. భారత్ లోకి వచ్చిన తరువాత అతని పేరును విజయ్ దాస్ గా మార్చుకున్నాడు. గత ఆర్నెళ్ల క్రితం ముంబయికి వచ్చాడు. అక్కడ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేశాడు. అయితే, సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే వెళ్లాడని భావిస్తున్నాం. గతంలో ఎప్పుడైనా సైఫ్ ఇంటి పరిసరాల్లోకి వెళ్లాడా.. ఇప్పుడే తొలిసారి వెళ్లాడా అనే విషయంపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని డీసీపీ దీక్షిత్ తెలిపారు. అతడిని న్యాయస్థానం ఎధుట హాజరుపర్చి కస్టడీ కోరుతామని అన్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో.. సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లు తనకు తెలియదని నిందితుడు పేర్కొన్నట్లు సమాచారం. దొంగతనం ఉద్దేశంతోనే ఇంట్లోకి ప్రవేశించానని, అకస్మాత్తుగా సైఫ్ అలీఖాన్ కనిపించే సరికి అతనిపై కత్తితో దాడి చేశానని నిందితుడు పేర్కొన్నట్లు తెలిసింది. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ గురించి మరింత సమాచారం సేకరించిన పోలీసులు.. అతను బంగ్లాదేశ్ పౌరుడు అయితే భారతదేశంలోకి అక్రమంగా ఎలా ప్రవేశించడానే విషయాలపై ఆరా తీస్తున్నారు.
సైఫ్ అలీఖాన్ పై నిందితుడు దాడిచేసిన సమయంలో కొంతభాగం కత్తి ముక్క అతని వెన్నుముక భాగంలో ఇరుక్కుపోయింది. దానిని వైద్యులు ఆపరేషన్ తీసి బయటకు తీశారు. అయితే, కత్తికి సంబంధించిన మరో ముక్కను పోలీసులు గుర్తించారు. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ చిన్న కుమారుడు జహంగీర్ గదిలోనే ఆ కత్తి ముక్కను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న కత్తి ముక్కను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. కత్తిపై వ్యక్తి వేలిముద్ర సాక్ష్యాలను సేకరించనున్నారు.
ముంబై పోలీసులు థానేలోని హీరానందానీ ఎస్టేట్ సమీపంలోని మెట్రో నిర్మాణ స్థలం సమీపంలోని లేబర్ క్యాంప్ కు సమీపంలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు పొదల్లో దాక్కొని ఉండగా పోలీసులు పట్టుకున్నారు.