Disinfection Tunnel – Sanitizer Tunnel: డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్స్ వినియోగంపై సోమవారం(సెప్టెంబర్-7,2020)సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్స్ హానికరమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వైద్య పరంగా, మానసికంగా హానికరమని స్పష్టం చేసింది. డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్స్ వాడొద్దని అందరికీ చెప్పామని కేంద్రం పేర్కొంది.
అయితే, హానికరమైనప్పుడు వాటిని ఎందుకు నిషేధం విధించలేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై మంగళవారం కేంద్ర ప్రభుత్వం సరైన ఆదేశాలు జారీ చేస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్స్‌పై రేపు కేంద్రం నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది.
గుర్ సిమ్రన్ సింగ్ నరులా అనే న్యాయ విద్యార్థి డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్స్ నిషేధించాలని పిటిషన్ దాఖలు చేశారు. మనుషులపై ఉన్న క్రిములను సంహరించే పేరుతో పురుగుల మందులను చల్లడం నిషేధించాలని పిటిషనర్ కోరారు. వాటి ఉత్పత్తి, వాడకం సైతం నిలిపివేయాలని అభ్యర్థించారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక రకాల క్రిమిసంహారక పరికరాలు మార్కెట్లోకి వచ్చాయని, ఇవి వైరస్ను నియంత్రిస్తాయని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని పిటిషనర్ ఆరోపించారు. డబ్ల్యూహెచ్ఓ సహా ఇతర ప్రామాణిక సంస్థలు వీటి ప్రమాదకరమైన ప్రభావం గురించి హెచ్చరించాయని గుర్తుచేశారు.