నేతలకు షాక్ : వేర్పాటు వాదులకు సెక్యూరిటీ ఉపసంహరణ

శ్రీనగర్ : పుల్వామా ఘటన అనంతరం జమ్మూ ప్రభుత్వం కొందరు వేర్పాటు వాద నేతలకు కల్పిస్తున్న భద్రత తొలగించింది. భారత్ లో ఉంటూ పరోక్షంగా పాకిస్తాన్ కు సహకరిస్తున్న 5 గురు జమ్మూకాశ్మీర్ వేర్పాటు వాద నేతలకు అక్కడి ప్రభుత్వం భద్రత ఉపసంహరించింది. ప్రభుత్వ భద్రత కోల్పోయిన వేర్పాటువాద నేతల్లో మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, షబీర్ షా, హషిం ఖురేషి, బిలాల్ లోన్, అబ్దుల్ ఘనీ భట్ లు ఉన్నారు.
ఆదివారం సాయంత్రం నుంచి వేర్పాటు వాద నేతలకు ప్రభుత్వం ఇప్పటి వరకు కల్పిస్తున్న అన్ని రకాల భద్రతా సౌకర్యాలను, రవాణా, వాహన సౌకర్యాలను ఉపసంహరించనున్నారు. ప్రభుత్వం కల్పించే ఏ ఇతర సౌకర్యాలకు వారు అర్హులు కాదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇంకా ఇతర వేర్పాటు వాదనేతలెవరైనా ఉన్నారనే అంశం సమీక్షించి వారికి ఇస్తున్నరక్షణ ఇతర సౌకర్యాలను కూడా ఉపసంహరించే పనిలో జమ్మూ కాశ్మీర్ అధికారులు ఉన్నారు.