RSS Coordination Committee Meeting: గతంలో కులవివక్ష లేదనే భావనకు కొంతమంది మద్దతు ఇస్తున్నారని, కానీ మన దేశంలో కులవివక్ష కారణంగా అన్యాయం జరిగిన మాట వాస్తవమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పుడు ఇదే అంశంపై మరో ఆర్ఎస్ఎస్ నేత కూడా స్పందించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వందల సంవత్సరాలుగా కులం ఆధారంగా విద్యను దూరం చేశారని, రిజర్వేషన్లు వారిని ఒక చోట చేర్చడానికి రాజ్యాంగం ద్వారా మద్దతిచ్చారని, అది వారి హక్కని ఆర్ఎస్ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ మన్మోహన్ వైద్య అన్నారు.
అలాగే మణిపూర్ హింసపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం (సెప్టెంబర్ 16) మహారాష్ట్రలోని పూణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మన్మోహన్ వైద్య మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “మన సమాజం అనేక సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు గౌరవాన్ని, సౌకర్యాలను, విద్యను దూరం చేసింది. కులం ఆధారంగానే ఇవి జరిగాయని చెప్పాల్సిందే. అయితే రిజర్వేషన్లు వారికి చేయూతనిచ్చాయి. వారిని ఒకచోట చేర్చడానికి రాజ్యాంగం ద్వారా మద్దతు లభించింది. రిజర్వేషన్లు పొందేందుకు వారు అర్హులు” అని ఆయన అన్నారు.
Caste System: గతంలో కులవివక్ష లేదనడం అబద్ధం, జరిగిన అన్యాయాన్ని అంగీకరించాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్
అయితే రాజకీయపరమైన రిజర్వేషన్ల గురించి తాము చర్చించలేదని అన్నారు. మహారాష్ట్రలోని పూణెలో గురువారం నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమన్వయ కమిటీ మూడు రోజుల సమావేశం ప్రారంభమైంది. ఇందులో సంఘ్‌కు చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ప్రస్తుత సామాజిక అంశాలు, జాతీయ భద్రత, విద్య, జాతీయ సేవ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక సామరస్యాన్ని కొనసాగించడం వంటి అంశాలపై చర్చించారు.
ఇక మణిపూర్ హింసపై ఆయన స్పందిస్తూ.. “మణిపూర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మా కార్యకర్తలు దాని గురించి మాకు తెలియజేసారు. అయితే ప్రధానంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మైతీ, కుకీ సంఘాల మధ్య వివాదం ఉంది. మా వాలంటీర్లు ప్రజలతో టచ్‌లో ఉన్నారు. రెండు సంఘాలతో మాట్లాడుతున్నాయి” అని అన్నారు. మే 3న మణిపూర్‌లో హింసాకాండ ప్రారంభమైంది. కాగా, ఈ హింసలో ఇప్పటివరకు 175 మంది మరణించగా, 1108 మంది గాయపడ్డారు. మరో 32 మంది గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. షెడ్యూల్డ్ తెగ (ST) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌కు నిరసనగా గిరిజన సంఘీభావ యాత్ర నిర్వహించడంతో హింస చెలరేగింది.