మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన ఒక రోజు తర్వాత శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ల మధ్య ఓ పొత్తు ఖారారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మూడు పార్టీలు ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించనున్నట్లు సమాచారం.
బీజేపీతో తెగదంపులు తర్వాత ఎన్పీసీ-కాంగ్రెస్ తో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అయిన సమయంలో ఐదేళ్లు తమకే సీఎం కావాలని శివసేన ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే శివసేన కంటే కేవలం 2సీట్లు మాత్రమే తక్కువ వచ్చిన తమకు ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఎన్సీపీ తేల్చిచెప్పింది. మరోవైపు కాంగ్రెస్ కూడా శివసేన-ఎన్సీపీ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇవ్వాలని గతంలో నిర్ణయించినప్పటికీ ఇప్పుడు మూడు పార్టీల మధ్య పవర్ షేరింగ్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది.
ప్రభుత్వంలో మొదటి సభ భాగం శివసేన వ్యక్తి సీఎంగా, రెండవ భాగం ఎన్సీపీ వ్యక్తి సీఎంగా ఉంటారు. అయితే ఈ ప్రభుత్వంలో జూనియర్ గా వ్యవహరించబోయే కాంగ్రెస్ కు మొత్తం ప్రభుత్వ కాలం డిప్యూటీ సీఎం పదవితో పాటు అసెంబ్లీ స్పీకర్ పదవి దక్కనుంది. మంత్రి పదవులు మూడు పార్టీలకు సమానంగా ఉంటాయి. ఈ మేరకు మూడు పార్టీల మధ్య ఒప్పందం ఖారారైనట్లు సమాచారం. శివసేన తరపున ఉద్దవ్ సీఎం అయితే అయోధ్య ఇష్యూ గురించి ఆయన ఏ విధమైన వ్యాఖ్యలు చేయకూడదని కాంగ్రెస్-ఎన్సీపీ కండీషన్ పెట్టాయి. తమకు సిద్ధాంతాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కలిసి పనిచేసే మార్గం కోసం చూస్తున్నట్లు ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. మంగళవారం రాత్రి ఉద్దవ్ సోనియా ముఖ్య అనుచరుడు,కాంగ్రెస్ లీడర్ అహ్మద్ పటేల్ సమావేశమయ్యారు. అంతా సజావుగానే జరుగుతుందని,ఖచ్చితమైన సమయంలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన చేస్తామని ఉద్దవ్ తెలిపారు.