Covid Vaccine Production : ఆగస్టులోగా కరోనా టీకాల ఉత్పత్తి పెంచుతాం.. కేంద్రానికి సీరం, బయోటెక్ హామీ..

వచ్చే నాలుగు నెలల్లో కరోనా టీకాల ఉత్పత్తిని పెంచుతామని కేంద్రానికి భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ హామీ ఇచ్చాయి. కేంద్ర ఆరోగ్యశాఖ, భారత ఔషధ నియంత్రణ సంస్థ అడిగిన నేపథ్యంలో.. జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల టీకా ఉత్పత్తి ప్రణాళికలను ఈ కంపెనీలు ప్రభుత్వానికి సమర్పించాయి.

Covid Vaccine Production : వచ్చే నాలుగు నెలల్లో కరోనా టీకాల ఉత్పత్తిని పెంచుతామని కేంద్రానికి భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ హామీ ఇచ్చాయి. కేంద్ర ఆరోగ్యశాఖ, భారత ఔషధ నియంత్రణ సంస్థ అడిగిన నేపథ్యంలో.. జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల టీకా ఉత్పత్తి ప్రణాళికలను ఈ కంపెనీలు ప్రభుత్వానికి సమర్పించాయి. జూలైలో 3.32 కోట్లు, ఆగస్టు, సెప్టెంబర్‌లలో 7.82 కోట్ల చొప్పున కొవాగ్జిన్‌ టీకా డోసులను ఉత్పత్తి చేస్తామని భారత్‌ బయోటెక్‌ తెలిపింది.

ఆగస్టు నాటికి నెలకు 10 కోట్ల కొవిషీల్డ్‌ టీకా డోసులను ఉత్పత్తి చేస్తామని, సెప్టెంబర్‌లో కూడా దానినే కొనసాగిస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిధి వెల్లడించినట్టుగా తెలుస్తోంది. కొవాగ్జిన్‌ ఉత్పత్తిని మే-జూన్‌ నాటికి రెట్టింపు చేస్తామని, జూలై-ఆగస్టు నాటికి ఆరు నుంచి ఏడు రెట్లు పెంచుతామని కేంద్రం ప్రకటించింది.

సెప్టెంబర్‌లోగా నెలకు 10 కోట్ల కొవాగ్జిన్‌ డోసులు ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ 3.0, మిషన్‌ కొవిడ్‌ సురక్ష కింద స్వదేశీ కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లోభాగంగా కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేస్తున్న హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ కంపెనీతోపాటు కొన్ని ప్రభుత్వరంగ సంస్థల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటానికి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.

ఈ మేరకు బెంగళూరులోని భారత్‌ బయోటెక్‌ కొత్త కేంద్రానికి, ముంబైలో పని చేస్తున్న హాఫ్కిన్‌ బయోఫార్మా కంపెనీకి 65 కోట్ల చొప్పున గ్రాంటును కేంద్రం ఇవ్వనుంది. మొత్తంగా ఆగస్టు-సెప్టెంబర్‌ నాటికి ఇవి నెలకు కోటి నుంచి కోటిన్నర డోసులను అందిస్తాయి తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు